● ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్‌తో ఉపాధ్యాయుల సతమతం
● పెరిగిన హాజరు శాతం, సెలవుల నమోదు
● ఇన్ సరే.. ఔట్ కనిపించని వైనం
● పర్యవేక్షణ పెంచుతామంటున్న అధికారులు
సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో కొందరు సక్రమంగా విధులకు హాజరుకావడం లేదనే విమర్శలు ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో అయితే అంతే సంగతులు అన్నట్లు చెప్పుకుంటారు. దీనిని అరికట్టేందుకు గతంలో బయోమెట్రిక్ పద్ధతిన హజరు నమోదు చేసేవారు. కొంతకాలం తర్వాత అది మూలనపడింది. దీంతో ఈ ఏడాది ముందుగా విద్యార్థుల హాజరుకోసం.. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఉపాధ్యాయుల హాజరు కోసం ఎఫ్‌ఆర్‌ఎస్(ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్)ను అమల్లోకి తీసుకొచ్చారు. ముఖం స్కాన్ చేస్తేనే హాజరు పడే విధంగా యాప్ ప్రవేశపెట్టారు. అయితే ఈ యాప్ ఉపయోగించడంలో కొందరు తడబాటు, మరికొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, మరికొందరు సతమతం అవుతున్నారు. ఏదీ ఏమైనా గతంలో పోలిస్తే జిల్లాలో ఉపాధ్యాయుల హాజరుశాతం పెరిగినట్లు స్పష్టం అవుతోంది.
పెరిగిన ఉపాధ్యాయుల హాజరు
ఎఫ్‌ఆర్‌ఎస్ వల్ల జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల హాజరుశాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు కలిపి మొత్తం 898 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో విద్యార్థులు లేని పాఠశాలలు 148 ఉన్నాయి. ఇవిపోగా మిగిలిన 750 పాఠశాలల్లో అన్ని కేటగిరీల ఉపాధ్యాయులు, నాన్‌టీచింగ్ ఉద్యోగులు కలిపి మొత్తం 3,930 మంది పనిచేస్తున్నారు. గతంలో జిల్లాలో ఉపాధ్యాయుల హాజరు 65శాతం మేరకే ఉండేది. ఎఫ్‌ఆర్‌ఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత 80శాతానికి మించి నమోదు కావడం గమనార్హం. అదే విధంగా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలతో సమన్వయం చేసుకుంటూ కొందరు నామమాత్రం సెలవులు పెట్టి నడిపించేవారనే ఫిర్యాదులు ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం ఎఫ్‌ఆర్‌ఎస్‌లో సెలవుల కాలం స్పష్టంగా కనిపించడంతో తప్పని సరిగా సెలవుల పెట్టాల్సి వస్తోంది. పెట్టిన సెలవు నమోదు అవుతుంది. ఇలా గతంలో జిల్లాలో రోజుకూ 100 నుంచి 150 మంది మేరకు సెలవులు పెట్టినట్లు ధ్రువీకరించగా ఇప్పుడు ఈ సెలవులు 300 నుంచి 350 వరకు నమోదు అవుతున్నాయి.
దశల వారీగా మార్పులు
ఎఫ్‌ఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన తర్వాత గతం కన్నా ఉపాధ్యాయుల హాజరు శాతం పెరిగింది. అయితే కొన్ని లోటుపాట్లు ఉన్న విషయంపై విద్యాశాఖ పెద్దల సమక్షంలో చర్చ జరుగుతోంది. దశల వారీగా మార్పులు వస్తాయి. అప్పటి వరకు సాయంత్రం పర్యవేక్షణ పెంచుతున్నాం.
–రవీందర్ రెడ్డి, డీఈఓ
ఇటీవల జిల్లాలో ఉపాధ్యాయుల హాజరు వివరాలు
మరింత మార్పు అవసరం..
ఉపాధ్యాయుల హాజరు నమోదు కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్‌ఆర్‌ఎస్‌లో మరిన్ని మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ ఉద్యోగుల్లో చర్చ. ప్రతీ ఉపాధ్యాయుడు ముందుగా తమ మొబైల్‌లో ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. దానిలో పనిచేస్తున్న పాఠశాల లొకేషన్, ఉపాధ్యాయుడు ముఖం నమోదు చేయాలి. ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు పనిచేస్తున్న పాఠశాల లొకేషన్ వద్ద సెల్‌ఫొన్‌లో ఎఫ్‌ఆర్‌ఎస్ చేయాలి. అయితే మారుమూల ప్రాంతాలు ఎక్కువగా ఉన్న మహబూబాబాద్ వంటి జిల్లాలో సిగ్నల్ లేకపోవడం, లొకేషన్ సక్రమంగా చూపకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అదేవిధంగా ఉదయంతో పాటు సాయంత్రం 4:30 తర్వాత మరోసారి ఎఫ్‌ఆర్‌ఎస్ చేయాలి. కానీ ప్రస్తుతం అది కనిపించడం లేదు. నమోదు అయినట్లు చూపించడం లేదని సమాచారం. దీంతో ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు సాయంత్రం వరకు ఉండేది.. ఉండనిది తెలియడం లేదని విద్యాశాఖ కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నారు.
తేదీ రిజిస్ట్రేషన్ హాజరు గైర్హాజరు సెలవు శాతం
18 3,852 3099 299 461 80.45
19 3,871 3,226 321 324 83.34
20 3,876 3,149 347 380 81.24
21 3,863 3,150 355 359 81.54
22 3,885 3,172 380 331 81.64
ముఖం చూపించాల్సిందే..