
విద్యార్థుల మేధస్సును వెలికితీయాలి
● కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్ అర్బన్: విద్యార్థుల మేధస్సును వెలికితీయడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధిలోని అనంతారం బీ ఫార్మసీ బాలికల గురుకుల కళాశాలను శనివారం కలెక్టర్ పరి శీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నూతన టెక్నాలజీతో సబ్జెక్ట్‌ల వారీగా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలన్నారు. అంకితభావంతో పనిచేస్తూ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన మెనూను ప్రకారం రుచికరమైన నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలన్నారు. వసతి గృహాల్లో వార్డెన్ హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, సీజనల్ వ్యాధుల వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులకు వేడి ఆహారాన్నే అందించాలని చెప్పారు. అనంతరం జిల్లా కేంద్రంలోని బాలికల పాఠశాలను సందర్శించారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, డిజిటల్ తరగతులను నిర్వహిస్తు విద్యార్థులను సైన్స్ టెక్నాలజీతోపాటు అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని, తరగతి గదులు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్లు పరిశుభ్రంగా ఉంచాలన్నారు.