
యూరియా కేటాయించకుండా బద్నాం చేసే కుట్ర
● పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
కొత్తగూడ: రాష్ట్రానికి రావాల్సిన యూరియా కేటాయించకుండా బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్ర చేస్తున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. పనుల జాతర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలకేంద్రం అంగన్‌వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మా ట్లాడుతూ.. యూరియా కేటాయింపు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుందన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెస్తూ, వినతులు ఇచ్చుకుంటూ కావాల్సి న కోటా సాధిస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్, రెండు లైన్ల రోడ్డు నిర్మాణం కోసం నివేదికలు పంపినట్లు తెలిపారు. పాకాల నుంచి గంగారం వరకు డబుల్ రోడ్డు మంజూరు చేయించి అటవీశాఖ అనుమతులతో పనులు చేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సవ్ టొప్పొ, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఆర్డీఓ కృష్ణవేణి, డీఆర్‌డీఓ మధుసూదన్‌రాజు, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీపీఓ హరిప్రసాద్, సీడీపీఓ నీలోఫర్ అజ్మీ, తహసీల్దార్ రాజు, ఎంపీడీఓ రోజారాణి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.