
పనుల జాతర షురూ..
● ఉపాధి హామీ పథకంలో గ్రామాలు,
తండాల్లో అభివృద్ధి పనులు
● జిల్లాలో 456 పనులకు
రూ.86.59కోట్ల నిధులు
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలు, మారుముల తండాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పనుల జాతర కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కూలీలకు పనులు కల్పించడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 2025–26 సంవత్సరానికి గానూ 456 పనులను గుర్తించారు. రూ.86.59 కోట్ల నిధులతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఆర్‌డబ్ల్యూస్ శాఖల సమన్వయంతో పనులు చేపడుతున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పలు పనులను ప్రారంభించగా.. మరిన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు.
పనులు ఇవే..
జిల్లాలో నూతనంగా అంగన్‌వాడీ, గ్రామపంచాయతీ భవనాలు, సెగ్రిగేషన్ షెడ్లు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్, ఇందిరా మహిళాశక్తి భరోసా కింద వ్యక్తిగత పశువుల పాక, గొర్రెలు, కోళ్ల షెడ్లు, పండ్ల తోటల పెంపకం, బావుల నిర్మాణం, వానపాముల ఎరువుల తయారీ కేంద్రం, అజోల్లా ఫిట్ నిర్మాణ పనులు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్‌శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ రహదారుల నిర్మాణం, సీఆర్‌ఆర్ నిధులతో కొత్తగా చేపట్టే పనులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు శంకుస్థాపన చేస్తారు.
కూలీల వివరాలు..
జిల్లా వ్యాప్తంగా 18 మండలాల పరిధిలో ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న కూలీలు మొత్తం 2,55,840 మంది ఉన్నారు. ఇందులో మహిళలు 1,33,915 మంది, పురుషులు 1,21,925 మంది ఉన్నారు.
పనులు త్వరగా పూర్తి చేస్తాం
జిల్లాలో ఉపాధి కూలీలకు పనులు కల్పించడం కోసం గ్రామాలు, తండాల్లో అంగన్‌వాడీ, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం, వివిధ పనులకు రాష్ట్ర ప్రభుత్వం పనులు జాతరను తీసుకువచ్చింది. ఈ పనులను డిసెంబర్ చివరి వరకు పూర్తి చేసి జిల్లా ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.
–మధుసూదన్‌రాజు, డీఆర్‌డీఓ

పనుల జాతర షురూ..