
ఐదు గంటలు హైరానా..
● మరిపెడలోని వసతి గృహం నుంచి పారిపోయిన విద్యార్థిని
● భూపాలపల్లి బస్టాండ్‌లో ప్రత్యక్షం
మరిపెడ: మరిపెడ పట్టణంలోని ఓ వసతి గృహం నుంచి ఉదయం పారిపోయిన విద్యార్థిని ఐదు గంటల తర్వాత మధ్యాహ్నం భూపాలపల్లి బస్టాండ్‌లో ప్రత్యక్షమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బుద్ధారం గ్రామానికి చెందిన బంటు భానుశ్రీ మరిపెడలోని మహాత్మా జ్యోతిరావుపూలే బాలికల వసతి గృహంలో ఐదో తరగతి చదువుతోంది. కాగా, విద్యార్థిని శుక్రవారం ఉదయం అల్పాహారం తీసుకునే సమయంలో పాఠశాల వెనుక నుంచి కంచె దాటి పారిపోయింది. తోటి విద్యార్థినుల ద్వారా విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ అనిత వెంటనే మరిపెడ సీఐ రాజ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. సీఐ ఆదేశాల మేరకు ఎస్సై సతీష్ సిబ్బందితో కలిసి కూడళ్ల వద్ద సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. విద్యార్థిని కార్గిల్ సెంటర్ మీదుగా మరిపెడ బస్ స్టేషన్ వైపునకు వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే విద్యార్థిని కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసి వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి బస్టాండ్‌లో ఆరా తీశారు. మధ్యాహ్నం 2గంటలకు భూపాలపల్లి బస్టాండ్‌లో భానుశ్రీని గుర్తించినట్లు కుటుంబ సభ్యులు మరిపెడ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా తనకు హాస్టల్‌లో ఉండడం ఇష్టం లేదని రెండు రోజుల క్రితం తోటి విద్యార్థినులకు చెప్పినట్లు తెలిసింది. ఐదు గంటల వ్యవధిలోనే విద్యార్థిని ఆచూకీ కనుగొన్న సీఐ రాజ్‌కుమార్, ఎస్సై సతీష్‌ను పలువురు అభినందించారు. కాగా, వసతిగృహం చుట్టూ ప్రహరీ లేకనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు.