
పంటలకు యూరియా అందించాలి
● మానుకోటలో రైతుల రాస్తారోకో
● మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ
సత్యవతి రాథోడ్, ఎల్‌హెచ్‌పీఎస్
మహబూబాబాద్ రూరల్: పంటలకు యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో రైతులు శుక్రవారం రోడ్డెక్కి అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మానుకోటలోని పీఏసీఎస్ వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురుచూసిన రైతులకు అధికారులు యూరియా బస్తాలు ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో కంకరబోర్డు వాటర్ ట్యాంకు వద్ద ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న డీఏఓ విజయనిర్మల, డీఏఓ కార్యాలయ ఏడీఏ మురళి, పీఏసీఎస్ చైర్మన్ రంజిత్, తహసీల్దార్ చంద్రరాజేశ్వర్ రావు అక్కడికి వచ్చి రైతులతో మాట్లాడారు. వారు వినకుండా తమకు యూరియా బస్తాలు ఇచ్చేంతవరకు రాస్తారోకో విరమించేదిలేదని రోడ్డుపైనే బైఠాయించారు. ఎల్‌హెచ్‌పీఎస్, బీఆర్‌ఎస్ నాయకులు రైతుల రాస్తారోకోకు మద్దతు తెలుపగా.. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ హాజరై మాట్లాడారు. యూరియా కోసం రైతులు క్యూలో రోజుల తరబడి నిలబడాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. రాస్తారోకోలో బీఆర్‌ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లూనావత్ అశోక్, ఎల్‌హెచ్‌పీఎస్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ బోడ లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు అంగోత్ చందూలాల్, మూడు రవి, అజ్మీరా శ్రీనివాస్, బాలరాజు, రైతులు పాల్గొన్నారు.