
యూరియా టోకెన్ల రగడ..
● రాత్రి వరకు టోకెన్లు ఇవ్వకపోవడంతో అధికారులపై రైతుల ఆగ్రహం
● బందోబస్తు మధ్య అధికారులను
బయటకు పంపిన పోలీసులు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ పట్టణంలోని పీఏసీఎస్ ఎదుట టోకెన్ల కోసం క్యూ లో నిల్చున్న రైతులకు నిరాశ తప్పలేదు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు టోకెన్లు ఇవ్వకపోవడంతో అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చే శారు. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం మహబూబాబాద్ పీఏసీఎస్‌లో పోలీసు బందోబస్తు మధ్యసొసైటీ, వ్యవసాయశాఖ అధికారులు సోమ, మంగళ, బుధవారాల్లో టోకెన్లు ఇచ్చిన రైతులకు యూరియా బస్తాలను సరఫరా చేశారు. సుమారు 1,890 వరకు టోకెన్లు ఇవ్వగా 1,250 బస్తాల యూరియాను అందజేశారు. మిగిలిన రైతులకు శుక్రవారం స్టాక్ రాగానే అందజేస్తామని ఏఓ తిరుపతిరెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా టోకెన్ల కోసం ఉదయం నుంచి రాత్రి వరకు రైతులు క్యూలో ఉన్నారు. ఈ క్రమంలో టోకెన్లు ఇవ్వమని అధికారులు చెప్పారు. దీంతో ఆగ్రహించిన రైతులు వారిని కార్యాలయం నుంచి బయటకు రానివ్వలేదు. టోకెన్లు ఇచ్చేంతవరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదని సొసైటీ ప్రధాన ద్వారం వద్ద రైతులు బైఠాయించారు. అయితే టౌన్, రూరల్ సీఐలు మహేందర్‌రెడ్డి, సర్వయ్య జోక్యం చేసుకుని పోలీసు బందోబస్తు మధ్య అధికారులను అక్కడి నుంచి పంపించారు. చేసేదేమీ లేక రైతులు ఇళ్లకు వెళ్లిపోయారు.