
నారాయణపురం రైతుల ఆందోళన
మహబూబాబాద్: ఎంజాయ్‌మెంట్ సర్వే ప్రకారం తమ భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయాలని కేసముద్రం మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన సుమారు 250మంది రైతులు బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్వోబీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై రాస్తారోకో నిర్వహించగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. తర్వాత పోలీసుల అనుమతితో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన ఆందోళన సాయంత్రం 4.30 గంటల వరకు సాగింది. కలెక్టరేట్‌లోని ఉద్యోగులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈక్రమంలో రైతులకు పోలీసుల మధ్య వాగ్వాదంతో పాటు స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆతర్వాత మరో గేటు నుంచి ఉద్యోగులను పంపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. 60ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 1,827 ఎకరాల పట్టా భూములను 2017లో భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా అటవీ భూములుగా పేర్కొంటూ పట్టాలు రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంజాయ్‌మెంట్ సర్వే చేసి కొన్ని నెలలు గడుస్తున్నా నేటికీ పట్టాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 600 మంది రైతులు ప్రభుత్వ పథకాలను కోల్పోవాల్సి వస్తోందన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు అందజేయాలని డిమాండ్ చేశారు. కాగా ధర్నా సమయంలో కె.రాంరెడ్డి అనే రైతు కండ్లు తిరిగి పడిపోగా వెంటనే పక్కకు కూర్చోబెట్టి నీళ్లు తాగించారు. సాయంత్రం 4.30 గంటల తర్వాత ధర్నా విరమించి అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. రూరల్ సీఐ సర్వయ్య ఆధ్వర్యంలో కేసముద్రం ఎస్సై మురళీధర్‌తో పాటు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో రైతులు దారావత్ రవి, లక్ష్మిపతి, శ్రీనివాస్, బిచ్యా, లచ్చు, లక్ష్మి, సరోజన, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో ర్యాలీ..
కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో
పట్టాదారు పాసుపుస్తకాలు
ఇవ్వాలని డిమాండ్
రైతులు.. పోలీసుల మధ్య వాగ్వాదం

నారాయణపురం రైతుల ఆందోళన