పడకేసిన పారిశుద్ధ ్యం | - | Sakshi
Sakshi News home page

పడకేసిన పారిశుద్ధ ్యం

Aug 20 2025 5:27 AM | Updated on Aug 20 2025 5:27 AM

పడకేసిన పారిశుద్ధ ్యం

పడకేసిన పారిశుద్ధ ్యం

మహబూబాబాద్‌: మానుకోట మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు నామమాత్రంగా జరుగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రోడ్లపై చెత్తాచెదారం తొలగించడం లేదు. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారి పందులు స్వైర విహారం చేస్తున్నాయి. కాల్వలు శుభ్రం చేయకపోవడంతో మురుగు నీరు నిల్వ ఉండి దోమలు విపరీతంగా పెరిగి రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దాటిన లక్ష జనాభా..

మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులు ఉండగా.. 68,889 మంది జనాభా, 57,828 మంది ఓటర్లు ఉన్నారు. విద్యా, ఉద్యోగం, వ్యాపారం రీత్యా మానుకోటలో నివాసం ఉండే వారితో కలిపి లక్ష జనాభా దాటుతుంది. 25,000 పైగా గృహాలు ఉన్నాయి. అవుట్‌ సోర్సింగ్‌లో 205 మంది పని చేస్తుండగా.. వారిలో 143 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. ట్రాక్టర్లు 11, మూడు చక్రాల ఆటోలు 14, నాలుగు చక్రాల ఆటోలు 19ఉండగా.. ప్రతీరోజు 33 టన్నుల చెత్త సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సిగ్నల్‌కాలనీ శివారులో ఒక చెత్త డంపింగ్‌ యార్డు, గాంధీపురం గ్రామ శివారులో మరో డంపింగ్‌ యార్డు ఉన్నాయి.

పర్యవేక్షణ కోసం శానిటరీ ఇన్‌స్పెక్టర్లు..

మానుకోట మున్సిపాలిటీలో అదనపు కలెక్టర్‌ లెనిన్‌ వత్సల్‌ టొప్పో కూడా ఆకస్మికంగా పారిశుద్ధ్య పనులను తనిఖీ చేస్తున్నారు. పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా పాత బజార్‌కు ఒకరు, కొత్తబజార్‌కు ఒకరు శా నిటరీ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. వారితో పాటు జవాన్లు, ఇన్‌చార్జ్‌లను నియామకం చేశారు. అయినా పర్యవేక్షణ మాత్రం సక్రమంగా లేదు. కమిషనర్‌ పనుల ను ఏమాత్రం పర్యవేక్షించడం లేదు. దీంతో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. ప్రధాన రహదారుల్లో మాత్రమే ప్రతీరోజు పనులు చేస్తున్నారు. శివారు కాలనీల్లో మాత్రం నామమాత్రంగా పనులు చేస్తున్నారు. ప్రతీరోజు వార్డుల్లో వాహనాలు రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

చెత్తాచెదారం..

రోడ్లపై చెత్తాచెదారం రోజుల తరబడి ఉండిపోతుంది. పలు ప్రాంతాల్లో 15 రోజులు దాటినా చెత్తాచెదారం తొలగించడం లేదు. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారి పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. వాటితో పాటు దోమల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. కాగా కాల్వలను నెలకు ఒకసారి కూడా శుభ్రం చేయడం లేదు.

హోటళ్ల సంఖ్య పెరగడంతో..

జిల్లా కేంద్రంలో ఫంక్షన్‌ హాల్స్‌ పాటు హోటళ్ల సంఖ్య పెరిగింది. వాటినుంచి చెత్తాచెదారం ఎక్కువగా వస్తోంది. ట్రాక్టర్‌ వాటి వద్దకు వెళ్లగానే వెంటనే నిండుతుంది. దీంతో ఇళ్ల నుంచి చెత్త సేకరించడం లేదు. కాగా హోటళ్లకు కమర్షియల్‌ పన్ను కేటాయించి ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేయవచ్చని సిబ్బంది చెబుతున్నారు. కమిషనర్‌ ప్రత్యేక దృష్టి పెట్టి ఆ సమస్య పరిష్కరించవచ్చు. అలాగే సరిపడా సిబ్బంది, వాహనాలు లేకపోవడం కూడా సమస్యగా మారింది.

సీజనల్‌ వ్యాధులు..

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయి. దీంతో రోగులు ఆస్పత్రుల బాట పడుతున్నారు. కాగా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, దోమల సంఖ్య తగ్గించేందుకు ఫాగింగ్‌తో పాటు ఆయిల్‌ బాల్స్‌ వేయాలని స్థానికులు కోరుతున్నారు.

మానుకోటలో రోడ్లపై చెత్తాచెదారం

అపరిశుభ్రంగా సైడ్‌ డ్రెయినేజీలు

పందుల స్వైరవిహారం, దోమల బెడద

రోగాల బారిన ప్రజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement