
యూరియా పక్కదారి!
సాక్షి, మహబూబాబాద్/ నెల్లికుదురు: ఒక వైపు యూరియా బస్తాల కోసం రైతులు కుస్తీ పడుతుంటే.. మరోవైపు రాత్రికిరాత్రే లారీలోడు యూరియా అధిక ధరలకు అమ్మకాలు జరిపారు. ఈ తతంగమంతా తమకేమీ తెలిదన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు వ్యవహరించడం.. కంటితుడుపు చర్యలతో సరిపెట్టే ప్రయత్నం చేస్తున్న సంఘటన నెల్లికుదురు మండలంలో జరిగింది.
ఈ–పాస్‌లో నమోదు చేయకుండా..
రైతులకు కావాల్సిన యూరియా వివరాలను మండల వ్యవసాయశాఖ అధికారి నుంచి ఏడీఏ, డీఏఓలు ధ్రువీకరించిన తర్వాత.. ప్రభుత్వానికి ఇండెంట్ పంపుతారు. వచ్చిన మొత్తం యూరియాలో 60శాతం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్, ఆగ్రోస్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా విక్రయిస్తారు. మిగిలిన 40శాతం ప్రైవేట్ వ్యాపారుల ద్వా రా అమ్మకాలు జరుపుతారు. అయితే వచ్చిన స్టాక్ వివరాలను ముందుగా ఈ–పాస్ పోర్టల్‌లో నమోదు చేయాలి. తర్వాత రైతు వారీగా ఆధార్, పట్టాదారు పాస్‌పుస్తకం చూసి వేలి ముద్రలు లేదా ఫోన్‌లో ఓటీపీ ద్వారా రైతును నిర్ధారించి అమ్మకాలు చేయాలి. అయితే అదేమీ లేకుండా నెల్లికుదురు మండలం నర్సింహులగూడెం గ్రామంలోని శరత్ ఫర్టిలైజర్ షాప్ యజమాని సోమవారం రాత్రి వచ్చిన 333 బస్తాల యూరియా లోడును గుట్టుచప్పుడు కాకుండా బస్తా రూ.350 చొప్పున అమ్మకాలు చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
అధికారుల ఆదేశాలు బేఖాతర్
యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్న విషయంపై కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సీరియస్‌గా తీసుకొని ప్రతీరోజు ఉదయం, సాయంత్రం అధికారులతో సమీక్షలు నిర్వహించారు. మండల ప్రత్యేకాధికారి, తహసీల్దార్, వ్యవసాయశాఖ అధికారి పర్యవేక్షణతో యూరియా అమ్మకాలు చేపట్టాలని ఆదేశించారు. రైతుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ఎస్పీ, ఇతర పోలీసు అధికారులు పర్యవేక్షణ చేసి యూరియా అమ్ముతున్నారు. అయితే నెల్లికుదురు మండలంలో సోమవారం చోటుచేసుకున్న సంఘటన జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలను బుట్టదాఖలు చేసినట్లు స్పష్టం అవుతోంది. ఈ వ్యవహారంలో వ్యవసాయశాఖ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. సోమవారం రాత్రి యూరియా లారీ వచ్చి తెల్లవారేసరికి విక్రయాలు జరిగినా.. ఈ విషయం రైతులు ఫిర్యాదు చేసినా అధికారులు ఆలస్యంగా స్పందించిన తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా యూరియా అమ్మకాలు చేసిన ఫర్టిలైజర్ షాపు యజమానితో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్య తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా యూ రియా అమ్మకాలు చేసి న నర్సింహులగూడెం గ్రామ ఫర్టిలైజర్ షాపు యజమానిపై చర్యలు తీసుకుంటున్నాం. ముందుగా షాపు లైసెన్స్ సస్పెండ్ చేశాం. నిబంధనల ప్రకారం యూరియా విక్రయాలు జరపకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం.
–అజ్మీరా శ్రీనివాసరావు, ఏడీఏ, మహబూబాబాద్
గుట్టుచప్పుడు కాకుండా
రాత్రికిరాత్రే అమ్మకాలు
ఈ–పాస్ పోర్టల్‌లో
నమోదు చేయకుండా విక్రయాలు
రైతుల వివరాలు లేవు..
అమ్మకాల జాబితా లేదు
నెల్లికుదురు మండలంలో సంఘటన
వ్యవసాయశాఖ అధికారుల
పాత్రపై అనుమానాలు

యూరియా పక్కదారి!