
వీరభద్రస్వామి హుండీ ఆదాయం రూ.63.77లక్షలు
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి హుండీల ఆదాయం రూ.63,77,826 వచ్చినట్లు ఆలయ ఈఓ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం వీరభద్రస్వామి ఆలయంలోని హుండీల్లో 2025 మార్చి 25నుంచి 2025 ఆగస్టు 18వ తేదీ వరకు భక్తులు సమర్పించుకున్న కానుకలను పర్యవేక్షణాధికారి సంజీవరెడ్డి, ఆలయ చైర్మన్ కొర్ను రవీందర్‌రెడ్డి సమక్షంలో లెక్కించారు. వీరభద్రస్వామి హుండీ ద్వారా రూ.48,48,078, భద్రకాళి హుండీ ద్వారా రూ.15,29,748 వచ్చినట్లు తెలిపారు. 78 అమెరికా డాలర్స్, 100 సౌతాఫ్రికా ర్యాండ్‌లు, 10 ఇంగ్లండ్ పౌండ్‌లు వచ్చినట్లు వివరించారు. మహబూబాబాద్‌కు చెందిన శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవాట్రస్ట్, మణుగూరుకు చెందిన శ్రీదుర్గ శివసాయి సేవా ట్రస్ట్, శ్రీవారి ట్రస్ట్ భక్త మండలి సభ్యులు లెక్కింపు చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు బాలగాని శ్రీనివాస్, చిన్నం గణేష్, శక్రునాయక్, ఉప్పలయ్య, జనార్దన్‌రెడ్డి, సోమ్లా నాయక్, వెంపటి శ్రీను పాల్గొన్నారు.
రైల్వే సహాయమంత్రిని
కలిసిన ఎంపీ
డోర్నకల్/గార్ల: ఢిల్లీలో రైల్వేశాఖ సహాయ మంత్రి రవినీత్‌సింగ్‌ను మహబూబాబాద్ ఎంపీ పొరిక బలరాంనాయక్ మంగళవారం కలిశారు. డీఆర్‌యూసీసీ సభ్యుడు బర్పుల లచ్చిరాంనాయక్‌తో కలిసి వెళ్లి డోర్నకల్, గార్ల రైల్వే స్టేషన్లలో నెలకొన్న సమస్యలు, కల్పించాల్సిన వసతుల గురించి చర్చించారు. రెండు స్టేషన్లలో పలు రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. సమస్యల పరిష్కారంపై సహాయమంత్రి సానుకూలంగా స్పందించారని డీఆర్‌యూసీసీ సభ్యుడు లచ్చిరాంనాయక్ తెలిపారు.
వైద్య సేవలపై
నిర్లక్ష్యం తగదు
గూడూరు: పల్లె దవాఖానాల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి సేవలందించాలని డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్ అన్నారు. మండలంలోని భూపతిపేట ఆయుష్మాన్ ఆరో గ్య మందిరాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఔషధాల నిల్వ రిజిస్టర్, సిబ్బంది రోజువారి రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలకు వైద్య సేవలపై పలు సూచనలు చేశారు. వర్షాకాలం సందర్భంగా సీజనల్ జ్వరాలు వస్తున్నాయని, మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ఎప్పటికప్పుడు నిల్వ ఉండేలా జాగ్రత్త పడాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉప మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
నెహ్రూసెంటర్: విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను తొలగించాలని, వినాయక చవితి సందర్భంగా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ డీఈ పి.విజయ్ అన్నారు. విద్యుత్‌శాఖ సీఎండీ వీడియో కాన్ఫరెన్స్‌లో మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ.. ఎత్తైన విగ్రహాలు ఉన్నందున ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లను సరి చేసుకోవాలన్నారు. కేబుల్ వైర్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆపరేటర్లు కేబుల్ వైర్ల రీ అలైన్‌మెంట్ చేసుకోవాలని సూచించారు. వినాయక విగ్ర హాల నిమజ్జన రూట్లు, మండపాలు పరిశీలించి విద్యుత్ సమస్యలు ఉంటే విద్యుత్ అధికారులు పరిష్కరించాలన్నారు. విద్యుత్‌శాఖ సీఎండీ ఆదేశానుసారం గణేశ్ విగ్రహాల తయారీ కేంద్రాలను పరిశీలించామని డీఈ తెలిపారు. కార్యక్రమంలో డీఈటీ హీరాలాల్ ఉన్నారు.
రైల్వేగేట్ మూసివేత
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ పట్టణంలోని ఏ క్యాబిన్ రైల్వేగేట్‌ను ట్రాక్ మరమ్మతుల నిమిత్తం మూసివేస్తున్నామని అధికారులు మంగళవారం తెలిపారు. ఈనెల 21వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూడో లైన్ నిర్మాణ పనులు జరుగుతాయన్నారు. రైల్వే గేట్ వైపునకు వచ్చే పాత, కొత్త బజార్ల రహదారి మార్గాలు కూడా బంద్ ఉంటాయన్నారు. ప్రజలు, వాహనదారులు రైల్వే అధికా రులకు సహకరించాలని కోరారు.

వీరభద్రస్వామి హుండీ ఆదాయం రూ.63.77లక్షలు

వీరభద్రస్వామి హుండీ ఆదాయం రూ.63.77లక్షలు