
బస్తా కోసం కుస్తీ !
యూరియా అందక రైతుల నిరీక్షణ
సాక్షి, మహబూబాబాద్ : వానాకాలం పంటల సాగు కాస్తా ఆలస్యంగా ప్రారంభమైనా.. ఎట్టకేలకు సాగు అంచనా దిశగా ముందుకు సాగుతోంది. అయితే రోజుల తరబడి వేచి ఉంటే తప్పా బస్తా యూరియా దొరికే పరిస్థితి లేదు. దీంతో విసిగి వేసారిన రైతులు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన దుస్థితి వచ్చింది.. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాల్సిన అధికారులు సరఫరా లేదని చేతులెత్తేస్తుండడంతో రైతులు అసహనానికి గురవుతున్నారు.
పెరుగుతున్న సాగు..
ఈ సీజన్‌లో వర్షాలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో పత్తిసాగు కాస్తతగ్గి.. మొక్కజొన్న సాగు పెరిగింది. వరి సాగు ఇటీవల వర్షాలతో పుంజుకు ంది. ఈ వానాకాలం సీజన్‌లో 4,29,790 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని అంచనాలు వేశారు. ఇందులో పత్తి 84,854 ఎకరాలకుగాను 78,797 ఎకరాలు, మొక్కజొన్న 52,249 ఎకరాలకు 57,264 ఎకరాల్లో సాగు చేశారు. వరి 2,21,282 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేయగా ఇప్పటి వరకు 1,78,309 ఎకరాల్లో సాగైంది. ఈ నెలాఖరు వరకు మరో 50 వేల ఎకరాల్లో నాట్లు వేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మొత్తం 4,21,301 ఎకరాల్లో పంటలు సాగు చేయాల్సి ఉండగా 3,20,054 ఎకరాల్లో సాగుచేశారు.
పెరిగిన వినియోగం.. తగ్గిన సరఫరా
రోజు రోజుకు యూరియా వాడకం పెరుగుతూ వస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం ప్రణాళికలో పేర్కొన్న విధంగా సరఫరా చేయడం లేదు. వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం వరి, పత్తిలో ఎకరానికి రెండ బస్తాల యూరియా వేయాల్సి ఉండగా నాలుగు బస్తాలు వినియోగిస్తున్నారు. మొక్కజొన్నకు ఎకరానికి 2 నుంచి 3 బస్తాలు వేయాల్సి ఉండగా 4 నుంచి 8 బస్తాల యూరియా వాడుతున్నారు. సరఫరా మాత్రం అందుకు తగ్గట్టుగా లేదు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జిల్లాకు 29,701 మె ట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటి వరకు 17,901 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. జిల్లాకు సరఫరా కావాల్సిన యూరియా కన్నా 11,800 మెట్రిక్ టన్నులు తక్కువగా వచ్చింది.
తప్పని నిరీక్షణ
సకాలంలో యూరియా వేస్తేనే పంట ఏపుగా పెరుగుతుంది. దీంతో రైతులు పీఏసీఎస్, ఆగ్రోస్ ఇతర కేంద్రాల చుట్టూ తిరిగినా దొరకడం లేదు. పట్టాదారు పాస్ పుస్తకం తీసుకెళ్లి క్యూలో పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించినా చివరకు బస్తా యూరియా దొరకడం కష్టంగా మా రింది. ఆరోజు స్టాక్ అయిపోతే.. మరుసటి రోజు ఉదయం నుంచి మళ్లీ క్యూ కట్టాల్సి వస్తుంది. ఇలా ఒక్క బస్తా యూరియా కోసం కుస్తీ పట్టి మూడు రోజులు తిరిగితే కానీ యూరియా దొరకడం లేదు. దీంతో విసిగి వేసారిన రైతులు ఆందోళన చేయడం, నిరసనలు చేసే పరిస్థితి నెలకొంది.
జిల్లా వ్యాప్తంగా సోమవారం రైతుల
ఆందోళనలు ఇలా..
● మహబూబాబాద్ రూరల్: మానుకోట పీఏసీఎస్ ఎదుట సోమవారం 1000 నుంచి 1200 మంది రైతులు యూరియా కోసం తెల్లవారుజామున నుంచి ఎదురుచూశారు. కేవలం ఒక లారీలో 444 బస్తాలు మాత్రమే రావడంతో ఒకరికి ఒకటి చొప్పున ఇచ్చారు. మిగిలిన రైతులకు ఒకటి రెండు రోజుల్లో తెప్పించి పంపిణీ చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా.. రైతులకు అవసరమైన మేరకు యూరియా అందజేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నల్లపు సుధాకర్ డిమాండ్ చేశారు.
● తొర్రూరు: యూరియా సరిపడా అందించడం లేదంటూ సోమవారం డివిజన్ కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం ఎదుట రైతులు నిరసన తెలిపారు. యూరియా కావాలంటే ప్రైవేట్ షా పుల యజమానులు ఇతర ఎరువులు కొనాలని లింకు పెడుతున్నారని వాపోయారు.
● నెల్లికుదురు: సోమవారం యారియా బస్తాలు వస్తాయని రైతులకు చెప్పిన సొసైటీ అధికారులు తీరా.. ఉదయం సొసైటీ వద్దకు అన్నదాతలు వచ్చిన తర్వాత ఈరోజు బస్తారు రావడంలేదని చెప్పారు. దీంతో రైతులు నెల్లికుదురు మహబూ బాబాద్ ప్రధాన రహదారిపై బైటాయించారు.
● గూడూరు: రైతులు ఉదయం 5 గంటలకే పీఏసీఎస్ కార్యాలయం చేరుకున్నారు. గంట సేపు రైతులు వేచిఉన్న తర్వాత ఈరోజు యూరియా రాదని సిబ్బంది చెప్పడంతో రైతులంతా జాతీయ రహదారిపైకి చేరుకొని బస్టాండ్ సెంటర్‌లో రాస్తారోకో చేపట్టారు. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
● నర్సింహులపేట: యూరియా ఎదురు చూస్తున్న రైతులకు సోమవారం యూరియా రావడంలేదని తెలిసి పీఏసీఎస్ కార్యాలయం ఎదుట, అంబేడ్కర్ సెంటర్‌లో రోడ్డుపై బైఠాయించారు. బీజేపీ మండల నాయకులు సైతం సొసైటీ వద్ద ఆందోళన చేశారు. సొసైటీలో యూరియా రాకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు ఇతర ఎరువులు కొనుగోలు చేస్తేనే యూరియా ఇస్తున్నారని రైతులు వాపోయారు.
● నెహ్రూసెంటర్: రైతుల పంటలకు అవసరమైన యూరియా వెంటనే సరఫరా చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారఽథి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సోమవారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
జిల్లాకు వచ్చిన యూరియా (మెట్రిక్ టన్నుల్లో)
అవసరంలో సగమే సరఫరా
ఆందోళన బాటపట్టిన అన్నదాతలు
రైతు సంఘాలు, పార్టీల మద్దతు
నెల కావాల్సింది సరఫరా
ఏప్రిల్ 542 4,237
మే 434 1,780
జూన్ 2,710 2,917
జూలై 10,840 5,241
ఆగస్టు 15,175 3,726
మొత్తం 29,701 17,901
(ఇప్పటి
వరకు)

బస్తా కోసం కుస్తీ !