
ప్రజలు చేపల వేటకు వెళ్లొద్దు
తొర్రూరు రూరల్: వర్షాల నేపథ్యంలో ప్రజలు చేపల వేటకు వెళ్లొద్దని తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్ కోరారు. మండలంలోని కంఠాయపాలెం, మడిపల్లి, గుర్తూరు గ్రామాల పరిధిలోని లో లెవల్ కల్వర్టులను పరిశీలించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు చేపల వేటకు, పశువులను ఏరులు, చెరువుల్లోకి తీసుకెళ్లవద్దన్నారు. లో లెవల్ కల్వర్టుల వద్ద అకస్మాత్తుగా వరద ఉదృతి పెరిగే అవకాశం ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. రాత్రి వేళల్లో ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. వర్షాల సమయంలో రైతులు, ప్రజలు అత్యవసరమైతేనే బయటికి రావాలన్నారు. పాఠశాలలకు వెళ్లే పిల్లలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సీఐ గణేష్, ఎస్సై ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
నేటి ప్రజావాణి రద్దు
మహబూబాబాద్: కలెక్టరేట్‌లో ఈనెల 18న జరిగే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదివా రం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు నేపథ్యంలో జిల్లాలో రెడ్ అలర్ట్ ఉన్నందున జిల్లా అధికారులను ప్రత్యేకాధికారులగా నియమించామన్నారు. దీంతో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు గమనించాలని సూచించారు.
శాంతియుతంగా గణేశ్
నవరాత్రులు జరుపుకోవాలి
మహబూబాబాద్ రూరల్ : ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదివారం తెలిపారు. రాష్ట్ర పోలీసు వెబ్‌సైట్‌లో జిల్లాలో గణేశ్ మండపాల నిర్వహణ, విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపులకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఆన్‌లైన్ సమాచారమనేది మండపం నిర్వహణకు సంబంధించిన సమాచారం కోసమేనని, ఈ సమాచారం ద్వారా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత, బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులువుగా ఉంటుందన్నారు. పోలీస్ శాఖ ఆన్‌లైన్ ద్వారానే అనుమతి మంజూరు చేస్తుందని, ఆ తరువాతనే వినాయక మండపాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గణేష్ మండపాల పూర్తి బాధ్యత మండపాల నిర్వాహకులదేనని, ప్రతీ మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. గణేశ్ మండపాల నిర్వాహకులు కమిటీ వివరాలు, బాధ్యుల వివరాలు, ఫోన్ నంబర్లను మండపంలో ఏర్పాటు చేయాలని సూచించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలని సూచించారు. గణేశ్ మండపంలో 24 గంటలు ఒక వలంటీరు ఉండే విధంగా నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద అనుమానాస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు వ్యక్తులు కనిపించినట్లుయితే తక్షణమే డయల్ 100కుగానీ లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
సాక్షి ఫొటోగ్రాఫర్లకు
రాష్ట్రస్థాయి అవార్డులు
హన్మకొండ కల్చరల్/జనగామ: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సాక్షి ఫొటోగ్రాఫర్లను రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపిక చేశారు. వరంగల్‌కు చెందిన సాక్షి సీనియర్ స్టాఫ్ ఫొటో గ్రాఫర్ పెద్దపల్లి వరప్రసాద్, జనగామ ఫొటోగ్రాఫర్ గోవర్ధనం వేణుగోపాల్ ఉత్తమ వార్త చిత్రాల పోటీల్లో బహుమతులకు ఎంపికయ్యారు. తెలంగాణ స్టేట్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో వారికి అవార్డులు ప్రదానం చేయనున్నారు.
రామప్ప శిల్పకళ అద్భుతం
వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ సంపద అద్భుతమని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీనివాస్‌రావు, జస్టిస్ సామ్ కోషి కొనియాడారు. మండలంలోని రామప్ప దేవాలయాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తులు సందర్శించారు. ఈ సందర్భంగా రామప్ప రామలింగేశ్వరస్వామిని శ్రీనివాస్‌రావు దర్శించుకోగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు.