అధిక సాంద్రత సాగు.. లాభాలు బాగు
దుగ్గొండి: తెల్లబంగారంపై మక్కువతో అన్నదాతలు అనదిగా పత్తి సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో రోజురోజుకూ పెట్టుబడి వ్యయం పెరగడం.. నానాటికీ దిగుబడి తగ్గడం.. దిగుబడికి వచ్చినా సరైన ధర లేక పోవడంతో పత్తి పంటపై అన్నదాతలకు ఆసక్తి తగ్గిపోతుంది. అయితే ఈ తరుణంలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసి అధిక దిగుబడులు సాధించొచ్చని వరంగల్ ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త యు. నాగభూషణం తెలిపారు. రోహిణి కార్తె మొదలు కావడం, రుతుపవనాలు విస్తరించడంతో రైతులు పత్తి పంట సాగు ప్రారంభించారు. మూస పద్ధతికి స్వస్తి పలికి నూతనంగా సాగు చేయాలని ఆయన తెలిపారు. సాధారణంగా రైతులు హచ్చు పద్ధతిలో పత్తి పంట సాగు చేస్తున్నారు. సాలుకు సాలుకు మధ్య 100 సెంటీమీటర్లు, మొక్కమొక్కకు మధ్య 100 సెంటీమీటర్ల దూరంతో విత్తనాలు నాటుతున్నారు. ఇలా సాగు చేయడం వల్ల ఎకరా భూమిలో 6 నుంచి 7 వేల మొక్కలు మాత్రమే వస్తున్నాయి. ఈ పద్ధతిలో సాగుతో పత్తి మూడు ధపాలుగా తీయాల్సి వస్తోంది. కూలీల భారం పెరుగుతుంది. పంట కాలం పెరుగుతుంది. రెండో పంట వేసుకునే అవకాశం రావడం లేదు. దిగుబడి ఏటీకి ఏడు తగ్గుతూ వస్తోంది. ప్రస్తుత పరిస్థితులలో గతేడాది ఎకరాకు 6 క్వింటాళ్లకు మంచి రాలేదు.
అధిక సాంద్రత పద్ధతిలో
ఎకరాకు 30 వేల మొక్కలు..
అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసే క్రమంలో సాలుకు సాలుకు మధ్య 80 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్ల దూరంతో విత్తాలి. ఎకరాకు 4 పత్తి గింజల ప్యాకెట్లు అంటే సుమారు 2 కిలోల విత్తనాలు సరిపోతాయి. ఇలా సాగు చేయడం వల్ల ఎకరా భూమిలో 25 నుంచి 30 వేల మొక్కలు వస్తాయి. పత్తి 40 రోజుల వయసులో, 70 రోజుల వయసులో చమత్కార్ మందును పిచికారీ చేయాలి. చమత్కార్ మందు పిచికారి వల్ల చేనంతా ఒకేసారి కాపునకు వస్తుంది. కాయలన్నీ ఒకేసారి కాస్తాయి. దూది సమయంలో కేవలం ఒకసారి మాత్రమే తీసుకోవచ్చు అనంతరం మళ్లీ రెండో పంటగా మొక్కజొన్న, వేరుశనగ, కూరగాయ పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎరువులు వేయడం, సస్యరక్షణ అంతా సాధారణ పద్ధతిలోనే చేసుకోవాలి. ఇలా అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడం వల్ల 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మార్కెట్‌లో ధర కొంతమేర తక్కువ ఉన్నా ఆశించిన మేర నికర ఆదాయం ఉండి రైతు లాభాలు పొందుతాడు.
ఎకరాకు 25 నుంచి 30 వేల
పత్తి విత్తనాలు నాటొచ్చు
సాధారణ పద్ధతిలో ఎకరాకు 7 వేలే..
ఎకరాకు 15– 20 క్వింటాళ్ల దిగుబడి
అధిక సాంద్రత సాగు.. లాభాలు బాగు
అధిక సాంద్రత సాగు.. లాభాలు బాగు


