పుష్కరాలకు వైద్యసేవలు
భూపాలపల్లి అర్బన్: ఈనెల 15నుంచి 26వ తేదీ వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం తివ్రేణి సంగమం వద్ద నిర్వహించనున్న సరస్వతి పుష్కరాల్లో భాగంగా భక్తుల సౌకర్యార్థం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్యశిబిరాలు, మెడికల్ క్యాంపుల్లో వైద్య సేవలు అందించేందుకు సిబ్బందిని నియమించారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి నుంచి స్పెషలిస్టు వైద్యులను కేటాయించారు.
తాత్కాలిక ఆస్పత్రి ఏర్పాటు
కాళేశ్వరం పీహెచ్‌సీలో తాత్కాలికంగా 10 పడకలను ఏర్పాటు చేసి అత్యవసర వైద్యసేవలు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆక్సిజన్, పల్స్‌మీటర్, ఈసీజీ సౌకర్యాలు కల్పించనున్నారు. ఇందులో ఇద్దరు స్పెషలిస్టు డాక్టర్లు, ఇద్దరు వైద్యాధికారులు, ల్యాబ్ టెక్నీషియన్, పార్మసిస్టు, స్టాఫ్ నర్సులను నియమించనున్నారు.
పీహెచ్‌సీలకు ఇబ్బంది కలగకుండా..
కాళేశ్వరంలో ఏర్పాటు చేసి వైద్య శిబిరాల్లో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొననున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 11 రోజులపాటు ఇబ్బందులు కలగకుండా వైద్యాధికారులు, సిబ్బంది కేటాయించారు. ఆర్‌బీఎస్‌కే, పల్లెదవాఖాలు, పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉంటే ఒక్కొక్కరిని, సిబ్బందిని కూడా అదేవిధంగా ఎక్కువ మంది ఉన్న సిబ్బందిని కాళేశ్వరం విధులకు పంపించే విధంగా ఏర్పాట్లు చేశారు.
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ పర్యవేక్షణ
కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీదేవిని నియమించారు. వైద్య సిబ్బందికి విధులు కేటాయించి వారు అందిస్తున్న సేవలు, ఇబ్బందులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా రెండు మానిటరింగ్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేసేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేయనున్నారు.
భక్తులకు ఇబ్బందులు కలగకుండా సేవలు
కాళేశ్వరం పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు ఆరోగ్య పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశాం. వేసవికాలం కావడంలో ఇక్కడికి వచ్చే భక్తులు జాగ్రత్తలు పాటించాలి. దగ్గు, జలుబు, ఇబ్బందులు ఎదురైనట్లయితే వెంటనే వైద్యశిబిరాలను సంప్రదించాలి. ఎక్కువసేపు ఎండలో తిరగొద్దు. మధ్యాహ్న సమయంలో స్నానం చేయకపోవడమే మంచిది. రోజూ ఒక్కో క్యాంపులో 2వేల ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తాం.
– మధుసూదన్, డీఎంహెచ్‌ఓ
కాళేశ్వరంలో 10 వైద్యశిబిరాలు
ఒక్కో శిబిరంలో 10 పడకలు
36 మంది వైద్యులు,
450 మంది సిబ్బంది
రెండు ప్రత్యేక బృందాల ఏర్పాటు
10 చోట్ల క్యాంపులు
కాళేశ్వరంలో 11 రోజులపాటు మూడు షిఫ్టులో మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నారు. ముక్తీశ్వర ఆలయ సమీపం, పాత ఈఓ కార్యాలయం, టెంట్ సిటీ, పార్కింగ్ –1, పార్కింగ్–2, పార్కింగ్ –3, హరిత హోటల్, గోదావరి మెయిన్ ఘాట్, వీఐపీ ఘాట్, హెలిపాడ్ దగ్గరలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం ఉన్న పీహెచ్‌సీలో 10 పడకలతో తాత్కాలిక వైద్యశాల ఏర్పాటు చేశారు. వైద్య శిబిరంలో డాక్టర్(ఎంఎల్‌హెచ్‌పీ), హెల్త్ సూపర్‌వైజర్, ఇద్దరు చొప్పున ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లను నియమించారు. వ్యాధి తీవ్రతను బట్టి అత్యవసరమైతే మహాదేవపూర్‌లోని సీహెచ్‌సీకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
పుష్కరాలకు వైద్యసేవలు
పుష్కరాలకు వైద్యసేవలు


