రెండు కుటుంబాల్లో విషాదం
వరంగల్: రెండు కుటుంబాలకు చెందిన ఓ బాలుడు, బాలిక మృతిచెందడంతో వరంగల్ ఎల్‌బీనగర్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి.. వరంగల్ నుంచి రెండు కుటుంబాలకు చెందిన వారు శనివారం హైదరాబాద్‌కు వెళ్తూ మార్గమధ్యలో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు సమీపంలోని రంగనాయకసాగర్‌లో ఈత కొట్టేందుకు దిగినట్లు తెలిసింది. మెహ్రాజ్(13), అర్భాజ్(15) చెరువులో కొంతలోతుకు వెళ్లడంతో ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతిచెందినట్లు తెలిసింది. మునిగిపోయిన వారిలో మెహ్రాజ్ మృతదేహాన్ని పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సాయంతో వెలికితీయగా అర్భాజ్ మృతదేహం కోసం గజఈతగాళ్లతో గాలింపు చేపట్టినట్లు సమాచారం. వివరాల కోసం ఎల్‌బీనగర్‌లోని ఏజాజ్ ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. చౌర్‌బౌళిలో కిరాయి ఉంటున్న ఏజాజ్ రెండు నెలల క్రితమే ఈప్రాంతానికి అద్దెకు వచ్చారని వారి వివరాలు తెలియవని పక్కనే కిరాయికి ఉన్నవారు తెలిపారు. కాగా బాలిక మెహ్రాజ్ తండ్రి యాకుబ్‌బాబా బిల్డర్ అని, అర్బాజ్ తండ్రి క్యాబ్, ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఇంతేజార్‌గంజ్ పోలీసులను సంప్రదించే ప్రయత్నం చేయగా.. స్పందించలేదు.
సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్‌లో నగరవాసుల మృతి
రెండు కుటుంబాల్లో విషాదం


