ఒత్తిడి.. పనిభారం
ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు మహిళా కండక్టర్ల ఆవేదన
హన్మకొండ: ఆర్టీసీ యాజమాన్యం.. మహిళా కండక్టర్ల భద్రతను గాలికి వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయాన్నే పిల్లలను వదిలేసి విధులకు వచ్చిన వారు.. రాత్రి ఆలస్యంగా ఇంటికి వెళ్తే .. ఇంత అర్ధరాత్రి డ్యూటీ ఏంటని భార్యాభర్తల మధ్య విబేధాలు వస్తుండడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబానికి ఆర్థిక ఆసరా ఉంటామని ఉద్యోగం చేస్తుంటే కాపురాలు కూలిపోయే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలని చూడకుండా అర్ధరాత్రి వరకు డ్యూటీలు వేస్తూ అధికారులు వేధిస్తున్నారని ఉద్యోగుల్లో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
కనిపించని సమయపాలన
నిబంధనల మేరకు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మహిళా కండక్టర్లు విధులు నిర్వహించాలి. కానీ, వరంగల్ రీజియన్‌లోని వరంగల్–2 డిపోలో రాత్రి 12 నుంచి ఒంటి గంట వరకు డ్యూటీలు చేయాల్సి వస్తోందని మహిళా కండక్టర్లు వాపోతున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల రాకతో ఈసమస్య తారాస్థాయికి చేరింది. చార్జింగ్ పేరుతో 2 గంటలకు పైగా సమయాన్ని వృథాగా గడపాల్సి వస్తోంది. ఆ రెండు గంటలు అదనంగా విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. ఈ విషయమై మహిళా ఉద్యోగుల్లో తీవ్రఅసహనం వ్యక్తమవుతోంది.
సమయం వృథా..
టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం వరంగల్ రీజియ న్‌కు మొత్తం 112 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించింది. వీటి నిర్వహణ బాధ్యతలు జేబీఎం ఎకోలైఫ్ సంస్థ చూసుకుంటుంది. 107 బస్సులు రోడ్లపై పరుగులు పెడుతుండగా.. మిగతావి అత్యవసర సమయాల్లో వాడేందుకు డిపోల్లో నిలిపి ఉంచుతా రు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఈ బస్సులు ఒకసారి చార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు తిరుగుతాయి. బ స్‌లో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కినా.. డ్రైవింగ్‌లో తేడా ఉన్నా.. చార్జింగ్ త్వరగా దిగిపోతుందని జేబీఎం ఉద్యోగులు చెబుతున్నారు. ఒక్క ట్రిప్పు వెళ్లి రాగానే డిపోలో చార్జింగ్ చేసుకోవాలి. చార్జింగ్ పెట్టిన ప్రతీసారి 2 గంటల సమయం పడుతుంది. చార్జింగ్ ఎక్కే వరకు కండక్టర్లు వేచి ఉండా లి. దీంతో అదనంగా మరో రెండు గంటలు విధులు నిర్వహించాల్సి వస్తోంది. కాగా.. నిరీక్షించిన సమయాన్ని ఆర్టీసీ యాజమాన్యం డ్యూటీగా పరిగణించకపోవడం తగదని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. ఒక్కోసారి ఒక ట్రిప్పులో మధ్యలోనే చార్జింగ్ తగ్గిపోతుండడంతో సమీపంలోని డిపోలో చార్జింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నట్లు కండక్టర్లు చెబుతున్నారు. మరింత సమయం విధుల్లోనే గడుపాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.
కుటుంబంలో కలహాలు..
చార్జింగ్ పేరిట అదనంగా విధులు నిర్వర్తించాల్సి వస్తుండడంతో ఇళ్లకు వెళ్లాక మహిళా ఉద్యోగులకు కుటుంబ సభ్యులు, భార్యాభర్తల మధ్య గొడవలవుతున్నాయని కార్మిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అర్ధరాత్రి డ్యూటీ దిగిన మహిళా కండక్టర్లు ఇంటికి చేరుకోవడానికి నానా తంటాలు పడుతున్నారని తెలిపారు. ఆ సమయంలో బస్సులు ఉండవని, ప్రైవేటు వాహనాల్లో ఇంటికి వెళ్తున్న క్రమంలో ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నిబందనల మేరకు మహిళ కండక్టర్లకు రాత్రి 8 గంటల వరకు డ్యూటీ ముగిసేలా చూడాలని కార్మిక సంఘాలతో పాటు, మహిళా ఉద్యోగులు కోరుతున్నారు.
వరంగల్ రీజియన్‌లో ఇలా..
మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు: 112
వీటిలో సూపర్ లగ్జరీ: 20
డీలక్స్: 22
ఎక్స్‌ప్రెస్: 70
మొత్తం మహిళా కండక్టర్లు: 99 మంది
(విడతల వారీగా విధులు)
నిర్ణీత సమయానికి మించి విధులు..
రాత్రి అవుతుండడంతో కరువైన భద్రత
ఆలస్యంగా ఇంటికి వెళ్తుండడంతో కుటుంబంలో విభేదాలు
వరంగల్ నగరంలోని గోపాల్‌పూర్‌కు చెందిన ఓ మహిళా కండక్టర్ (పేరు చెప్పడానికి ఇష్టపడడం లేదు) రాత్రి 8 గంటల వరకు నిర్వహించాల్సిన విధులు రాత్రి 12.30 వరకు డ్యూటీ చేయాల్సి వస్తోంది. ఆ సమయానికి తమ రూట్‌లో బస్సులుండవు. ఆటోలు కూడా చాలా అరుదు. చివరికి ఏదైనా ఆటో దొరికితే ఆలస్యంగా ఇంటికి వెళ్లడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ‘పనిభారం ఎక్కువైంది. మానసికంగా ప్రశాంతంగా ఉండలేక పోతున్నా’ అంటూ ఆ కండక్టర్ కన్నీటిపర్యంతమవుతోంది.
ఎలక్ట్రిక్ బస్సుల డ్యూటీతో అనారోగ్యం పాలవుతున్నాం..
ఎలక్ట్రిల్ బస్సుల డ్యూటీలో అనారోగ్యం పాలవుతున్నాం. ఒక ట్రిప్పు వెళ్లి రాగానే బస్సుకు చార్జింగ్ పెడుతున్నారు. చార్జింగ్ కావడానికి రెండు గంటలు పడుతుంది. ఈ స్టాండింగ్ టైమ్ పేరుతో రెండు గంటలు ఎలాంటి పని లేకుండా వేచి చూడాల్సి వస్తోంది. దీంతో రెండు గంటలు ఆలస్యంగా డ్యూటీ దిగాల్సి వస్తోంది. దీంతో ఇంటిలో సమస్యలు నెలకొంటున్నాయి. తద్వారా మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురై అనారోగ్యం పాలవుతున్నాం. ఈ రెండు గంటలు డ్యూటీ టైమ్‌లో లెక్కించడం లేదు.
– వెంకటమ్మ (పేరు మార్చాం) కండక్టర్
త్వరలో చార్ట్ మారుస్తాం..
మహిళా ఉద్యోగులు సమయానికి డ్యూటీ ముగించుకునేలా చార్ట్ రూపొందించాలని నిర్ణయం తీసుకున్నాం. రెండో ట్రిప్పు వెళ్లడానికి చార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మహిళా కండక్టర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గమనించాం. వాటిన అధిగమించేందుకు చర్యలు తీసుకుంటాం.
– జ్యోత్స్న, మేనేజర్, వరంగల్–2 డిపో
ఒత్తిడి.. పనిభారం


