కడవెండికి చేరిన రేణుక మృతదేహం
దేవరుప్పుల: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ ఎన్‌కౌంటర్‌లో అసువులు బాసిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు గుమ్ముడవెల్లి రేణుక అలియాస్ చైతే అలియాస్ సరస్వతి మృతదేహం మంగళవారం అర్ధరాత్రి 12.45 గంటలకు ఆమె స్వగ్రామం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి చేరింది. బుధవారం అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా, దంతెవాడ నుంచి రేణుక మృతదేహాన్ని ఆమె సోదరులు జీవీకే ప్రసాద్, రాజశేఖర్ స్వగ్రామం తీసుకురాగా గ్రామస్తులు, బంధు, మిత్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మూడు దశాబ్దాల క్రితం ఊరు విడిచి అడవి బాటపట్టిన రేణుక విగతజీవిగా రావడంతో తల్లిదండ్రులు జయమ్మ, సోమయ్య గుండెలవిసేలా రోదించారు. పెద్దనాన్న లక్ష్మీనర్సు ఇంటి వేదికగా దొడ్డి కొమురయ్య స్మారక స్తూపం వద్ద ప్రజల సందర్శనార్థం రేణుక మృతదేహం ఉంచారు. ఈ సందర్భంగా మాజీ మావోయిస్టులు గాదె ఇన్నయ్య, గాజర్ల అశోక్, తెలంగాణ రెడ్‌ప్లాగ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి రాజేష్ ఖన్నా, ఓయూ జేఏసీ నాయకుడు ఇప్ప పృథ్వీరెడ్డి.. రేణుక మృతదేహం వద్ద నివాళులర్పించారు. అనంతరం వారు వేర్వేరుగా మాట్లాడుతూ అనారోగ్యంతో నిరాయుధంగా పట్టుబడిన రేణుకను చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారని ఆరోపించారు. ఇలాంటి బూటకపు ఎన్‌కౌంటర్లకు పాలకవర్గాలు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు.
నేడు అంత్యక్రియలు
బంధు, మిత్రులు, మాజీల ఘన నివాళి


