‘గోరుబోలి’ భాష గుర్తింపు చరిత్రాత్మకం
మరిపెడ: కాంగ్రెస్ ప్రభుత్వం బంజారాల గోరుబోలి భాషను గుర్తించడం చరిత్రాత్మక నిర్ణయమని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్ అన్నారు. ఇటీవల అసెంబ్లీలో బంజారాల గోరుబోలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం మరిపెడలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ఎదుట సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల చిత్రపటాలకు రాంచంద్రునాయక్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షలు, దేశంలో 15 కోట్ల మంది బంజారాలు ఉన్నారని, గోరుబోలి భాషను గుర్తించడం ఆనందంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. మానుకోట మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, మండల అధ్యక్షుడు రఘువీరారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు రవి, నాయకులు వీసారపు శ్రీపాల్‌రెడ్డి, కొంపెల్లి సురేందర్‌రెడ్డి, గండి వీరభద్రం, లక్ష్మీనారాయణ, ఉపేందర్, కొండం దశరథ, బొడ్డు వెంకన్న, రవి, విజయ్, రవికాంత్, సురేశ్ ఉన్నారు.
ప్రభుత్వ విప్ జాటోతు రాంచంద్రునాయక్


