తొర్రూరు: జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల పనితీరు, అందిస్తున్న సేవలపై వైద్యాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అబార్షన్లకు అడ్డూఅదుపు లేకుండా పోతుందనే ఆరోపణలు ఉన్నాయి. వివిధ కారణాలతో మహిళలు అబార్షన్ల కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే వారు నిరాకరిస్తున్నారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అబార్షన్ చేస్తే చట్ట ప్రకారం శిక్షార్హులవుతారని స్పష్టంగా ఉన్నా.. కొందరు ప్రైవేట్ వైద్యులు బాధితుల నుంచి అందినకాడికి రాబట్టుకుని గుట్టుగా అబార్షన్లు చేస్తున్నారు. తాజాగా నర్సింహులపేటకు చెందిన 16 ఏళ్ల బాలిక గర్భం దాల్చగా అబార్షన్ కోసం తల్లి తన కూతురును తొర్రూరు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించింది. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఆస్పత్రి వైద్యుడిపై కేసు నమోదు చేశారు. దీంతో పాటు గర్భానికి కారకుడైన వ్యక్తిపై, అబార్షన్‌కు సహకరించిన తల్లిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు.
యథేచ్ఛగా అబార్షన్లు..
జిల్లాలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో అబార్షన్లు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. 2024 ఏప్రిల్ 7న కురవి మండలం పిల్లిగుంట్ల తండాలోని ఓ ఇంట్లో గర్భిణులకు ఆర్‌ఎంపీలు మొబైల్ యంత్రంతో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండగా పోలీసులు, వైద్యాధికారులు ఆ ప్రదేశానికి వెళ్లి వారిని పట్టుకున్నారు. 2023 అక్టోబర్‌లో తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ వికటించి ఓ మహిళ మృతి చెందింది. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఇలాంటివి పునరావృతం అవుతున్నాయి. జిల్లాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 986 మంది మాత్రమే ఆడపిల్ల లు ఉన్నారు. ఈ గణాంకాలు భవిష్యత్‌లో ఎదురయ్యే ప్రమాద ఘంటికలను తెలియజేస్తున్నాయి. జిల్లాలో ఏడాది కాలంలో 2,218 అబార్షన్లు జరిగినట్లు వైద్యాధికారులు గుర్తించారు.
నిబంధనలు ప్రచారానికే..
లింగనిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమనే విష యం ప్రచారానికే పరిమితమైంది. భ్రూణహత్యల నియంత్రణలో వైద్యారోగ్య శాఖ అధికారులు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లోని కొన్ని ఆస్పత్రులు ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. లింగ నిర్ధారణ పరీక్షలు నేరమని తెలిసినా కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ కేంద్రాల తీరు మారడం లేదు. అనుమతి లేకున్నా స్కానింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి ఉన్న కేంద్రాల్లో రేడియాలజిస్టు స్కానింగ్ చేస్తారు. బహిర్గత పరచరు. అనుమతిలేని కేంద్రాల్లో పుట్టేది ఆడో, మగో తేల్చేస్తున్నారు. ఇందుకు ఒక్కో వ్యక్తి నుంచి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం..
లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరం. అనుమతి లేకుండా స్కానింగ్ సెంటర్లు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అబార్షన్లు చేసినట్లు తేలితే ఆస్పత్రిని సీజ్ చేస్తాం. అన్ని స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ నిబంధనలను అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం. సమాచారం తెలిసిన వారు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.
– గుండాల మురళీధర్, డీఎంహెచ్‌ఓ
ఇద్దరిపై పోక్సో కేసు నమోదు
బాలికకు అబార్షన్ చేసిన ఘటనలో పోలీసులు ఇద్దరిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఎస్సై ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింహులపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళతో మరిపెడ మండలం చిల్లంచెర్ల గ్రామానికి పోలోజు రాజు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో వివాహిత కూతురుతోనూ రాజు శారీరక సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. అప్పటికే 5 నెలల గర్భం ఉందని తేలడంతో తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అబార్షన్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ నాగవాణి, చైల్డ్ లైన్ ప్రతినిధులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. వారి నిర్ధారణ అనంతరం పోలీ సులు, ఐసీడీఎస్, వైద్యాధికారులకు సమాచా రం అందించారు. ఐసీడీఎస్ అఽధికారుల ఫిర్యా దు మేరకు అబార్షన్ చేసిన వైద్యుడిపై కేసు నమోదు చేయడంతో పాటు గర్భం దాల్చేందుకు కారకుడైన వ్యక్తిపై, అబార్షన్‌కు సహకరించిన తల్లిపై పోక్సో కేసు నమోదు చేశారు.
అనుమతులు లేకున్నా.. లింగనిర్ధారణ
పరీక్షలు చేస్తున్న ప్రైవేట్ డయాగ్నోస్టిక్
సెంటర్లు, ఆస్పత్రులు
పట్టించుకోని వైద్యశాఖ అధికారులు
గుట్టుగా అబార్షన్లు!


