
పెంబర్తి చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేపడుతున్న పోలీసులు
వరంగల్ క్రైం: లోక్‌సభ ఎన్నికల వేడి మొదలైంది. దీంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం నుంచి తనిఖీలు మొదలయ్యాయి. ఇప్పటికే బెల్ట్ షాపులు నిర్వహించుకుండా ఆయా పోలీస్ స్టేషన్‌ల పరిధిలో కఠిన చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్‌షాపులు నిర్వహించినా.. సమయ పాలన తర్వాత మద్యం విక్రయించిన వారిపై కేసులు నమోదు చేసి తహసీల్దార్ల వద్ద బైండోవర్ చేస్తున్నారు. గతంలో కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసి.. ఎన్నికలకు ఎక్కువ సమయం ఉన్నందున ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఎత్తివేసిన చెక్‌పోస్టులను పోలీస్ అధికారులు తిరిగి గురువారం నుంచి ప్రారంభించారు. ప్రతి చెక్‌పోస్టులో పకడ్బందీగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీస్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నారు. చెక్‌పోస్టుల దగ్గర భారీగా పోలీస్ సిబ్బందిని మోహరించి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పందంగా కనిపించే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
కమిషనరేట్‌లో చెక్‌పోస్టులు ఇవే..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా పోలీస్ అధికారులు 23 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వరంగల్ పార్లమెంట్ నియోజవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజవర్గాల పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈస్ట్‌జోన్ పరిధిలో నర్సంపేట నియోజకవర్గంలో అయ్యప్ప గుడి, నల్లబెల్లి మండలం బోల్లోనిపల్లి, ఖానాపూర్ మండలం అశోక్‌నగర్, వరంగల్ తూర్పు నియోజవర్గం పరిధిలో లేబర్ కాలనీ జాన్‌పాక పీరీలు, నాయుడు పెట్రోల్ పంపు, వర్ధన్నపేట నియోజవర్గంలో హసన్‌పర్తిలోని అనంతసాగర్, డీసీతండా, చింత నెక్కొండ, సెంట్రల్ జోన్ పరిధిలో.. వరంగల్ పశ్చిమ నియోజవర్గం పరిధిలో కాజీపేట డిజీల్ కాలనీ, ఐశ్వర్యగార్డెన్ ములుగురోడ్డు, సీఎస్‌ఆర్ గార్డెన్, పరకాల నియోజవర్గ పరిధిలో కటాక్షపూర్ క్రాస్, గీసుగొండ కొమ్మాల, నడికూడ, హుజూరాబాద్ నియోజవర్గంలో ఎల్కతుర్తి పెంచికలపేట, స్టేషన్‌ఘన్‌పూర్ పరి ధిలో లింగాలఘణపురం జీడికల్, జఫర్‌గడ్ నల్లబండ, సాక్షి కార్యాలయం రాంపూర్, పాలకుర్తి నియోజవర్గంలో దేవరుప్పుల మండల కేంద్రం, రాయపర్తి కిష్టపూర్ క్రాస్, జనగామ నియోజవర్గం పరిధిలో.. జనగామ పెంబర్తి, బచ్చన్నపేట కొన్నె క్రాస్ వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
24 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు..
23 చెక్ పోస్టులతోపాటు కమిషనట్ పరిధిలో 24 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలుు ఏర్పాటు చేశారు. వీటితోపాటు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) బృందాలను 25 నియమించారు. ఇవి రెండు మండలాలకు ఒక బృందం చొప్పున పనిచేస్తాయి. ఒక్కో చెక్‌పోస్టులో 8మంది సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుళ్లు, ఆరుగురు సివిల్ కానిస్టేబుళ్లు, ఇద్దరు రెవెన్యూ సిబ్బంది, ఒక రెవెన్యూ అధికారి.. ప్రతి చెక్‌పోస్టులో వీడియోగ్రాఫర్ ఉంటారు. సరైన పత్రాలు ఉంటే రూ.49,900వరకు వెంట తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. 7ఫుల్ బాటిల్స్, కాటన్ (12) బీర్ల వరకు అనుమతి ఉంటుంది. రాజకీయ పార్టీల ప్రచార వస్తువులు వెంట ఉంటే వారి దగ్గర రూ.10వేలు నగదు ఉన్న సీజ్ చేస్తారు. చెక్ పోస్టులతోపాటు ఎంసీసీ బృందాలు కూడా అడుగుడుగునా తనిఖీలు చేపడుతాయి.
కమిషనరేట్ పరిధిలో 23చెక్ పోస్టులు
నిరంతరం ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు
రూ.49వేల వరకు అనుమతి
చెక్‌పోస్టులను తనిఖీ చేస్తున్న సీపీ