చలికాలం.. జాగ్రత్తలు తప్పనిసరి
● పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రభావం
● ‘సాక్షి’ ఫోన్‌ఇన్ కార్యక్రమంలో
ప్రొఫెసర్ సుమన్ సూచనలు
నెహ్రూసెంటర్: చలితీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు పాటిస్తూ అనారోగ్యానికి గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ప్రొఫెసర్ బండి సుమన్ సూచించారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఫోన్‌ఇన్ కార్యక్రమంలో ఆయన ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య సహాయంపై ప్రొఫెసర్లు బండి సుమన్, మోహన్, వసంత్ ప్రజలకు వివరించారు.
ప్రశ్న: చలికాలంలో పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు
తీసుకోవాలి?
– లక్ష్మణ్ గూడూరు, రఘు నడివాడ, శ్రవన్‌కుమార్ బయ్యారం, కరుణాకర్ కేసముద్రం
డాక్టర్: పిల్లల్లో చలి, వేడిని తట్టుకునే శక్తి తక్కువ. చలిలో పిల్లల్ని బయటకు తీసుకెళ్లొద్దు. స్వెట్టర్లు వాడాలి. జలుబు, దగ్గు వంటివి వస్తే వైద్యులను సంప్రదించాలి. సొంత వైద్యం చేయొద్దు.
ప్రశ్న: వృద్ధులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
– చక్రధర్ చిన్నగూడూరు, శేషాద్రి గుండంరాజుపల్లి, రజాక్ మానుకోట, కుమారస్వామి కంఠాయపాలెం
డాక్టర్: చలి, మంచు తగ్గేవరకు బయటకు వెళ్లకపోవడం మంచిది. ప్రొటీన్స్, పౌష్టికాహారం తీసుకోవాలి. స్వెట్టర్లు, దుప్పట్లు వినియోగించాలి. ఇప్పటికే ఏదేని జబ్బుకు సంబంధించి మందులు వాడుతుంటే క్రమం తప్పకుండా వేసుకోవాలి.
ప్రశ్న: జలుగు, దగ్గు, గొంతునొప్పి తగ్గడం లేదు?
– సురేష్ బొద్దుగొండ, మహేశ్వరీ మానుకోట, వెంకన్న మానుకోట, అమర్‌నాథ్ బయ్యారం, రితిక మానుకోట, సతీష్ మచ్చర్ల,
శ్రీనివాస్ అమనగల్
డాక్టర్: వాతావరణ పరిస్థితులు, చల్లగాలుల వల్ల జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి వస్తుంది. ఇన్‌ఫెక్షన్‌తో కూడా తగ్గకుండా ఉండొచ్చు. రోజుల తరబడి తగ్గకుంటే వైద్యులను సంప్రదించాలి.
ప్రశ్న: ఉదయం వాకింగ్‌కు వెళ్లొచ్చా..?
– యాకేందర్ తొర్రూరు, చారీ కురవి, రాజునాయక్ మరిపెడ, యాదగిరి కొత్తగూడ
డాక్టర్: ఉదయం చలి ఎక్కువగా ఉంటుంది. వేకువజామునే కాకుండా చలి తగ్గాక వాకింగ్ వెళ్లాలి. ఇంట్లోనే వ్యాయాయం చేయడం మేలు.
ప్రశ్న: చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
– వీరన్న మానుకోట, విజయ్ జయ్యారం,
కృష్ణవేణి గూడూరు, స్వామి గార్ల
డాక్టర్: వేడి ఆహారాన్ని తీసుకోవాలి. అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. దగ్గు, జలుబు, జ్వరం ఉంటే పులుపు తగ్గించాలి. వారానికి రెండుసార్లు మాంసాహారం తీసుకోవచ్చు.
ప్రశ్న: చర్మ సమస్యలు, దురద వస్తున్నాయి?
– ఉస్మాన్ మానుకోట, కుమారస్వామి తొర్రూరు, అశోక్ మరిపెడ, సతీష్ రాంపురం
డాక్టర్: చలికాలం చేతులు, కాళ్లు పగుళ్లకు గురైతే వైద్యులను సంప్రదించి లోషన్స్ వాడాలి. కాళ్లు, చేతులకు సాక్స్ ధరించాలి.
ప్రశ్న: ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాలు ఉన్నాయా?
– వెంకన్ననాయక్ మానుకోట, వీరన్న
దంతాలపల్లి, రాజశేఖర్ కేసముద్రం
డాక్టర్: అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. రక్త పరీక్షలు చేసి వైద్య సేవలు అందిస్తున్నాం. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలో వైద్యులను సంప్రదించి వైద్య సహాయం తీసుకోవచ్చు. జీజీహెచ్‌కు వస్తే డాక్టర్లు అందుబాటులో ఉంటారు.
ప్రశ్న: గ్రామాల్లో మెడికల్ క్యాంపులు
నిర్వహించాలి?
– సుధాకర్ జంగిలిగొండ, వెంకన్న కొత్తగూడ, మాలిక్ తొర్రూరు, ప్రకాశ్ కురవి
డాక్టర్: పీహెచ్‌సీలు, సబ్ సెంటర్ల ద్వారా వైద్యసేవలు అందుతున్నాయి. గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసేలా డీఎంహెచ్‌ఓకు తెలియజేస్తాం.
ప్రశ్న: ఆస్తమా రోగులు ఎలాంటి జాగ్రత్తలు
తీసుకోవాలి?
– వీరన్న కేసముద్రం, వెంకటేష్ మానుకోట, మురళీ మానుకోట, రాంబాబు గార్ల
డాక్టర్: ఆస్తమా రోగులు చలిలో బయటకు వెళ్లొద్దు. తప్పనిసరైతే మందులు వెంట తీసుకెళ్లాలి. వేడిగా ఉన్న పౌష్టికాహారం తీసుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రి లో వైద్యులు, మందులు అందుబాటులో ఉన్నాయి.
ప్రశ్న: చలిమంటలు వేసుకోవచ్చా?
– గణేష్ మానుకోట, రమేష్ లక్ష్మీపురం, వినయ్‌కృష్ణ అమీనాపురం, కుమార్ తొర్రూర్
డాక్టర్: చలిమంటల వల్ల ప్రమాదాలు జరగవచ్చు. మంటల నుంచి వచ్చే పొగతో శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడుతాయి. ఆస్తమా, జలుగు, దగ్గు ఉంటే మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రశ్న: హాస్టల్స్‌లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలి?
– అమీర్ తొర్రూరు, మధు మానుకోట, శ్రావణ్ మానుకోట, వెంకన్న మరిపెడ
డాక్టర్: విద్యార్థులు ఉదయమే చన్నీళ్లతో స్నానం చేస్తుంటారు. చలి తీవ్రతతో జలుగు, దగ్గు పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేక క్యాంపులు నిర్వహించేలా వైద్యశాఖ అధికారులకు తెలియజేస్తాం.
ప్రశ్న: జీజీహెచ్‌లో దంతాలకు చికిత్స ఉందా?
– వినయ్ ముడుపుగల్, రమేష్ గూడూరు,
డాక్టర్: వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఆస్పత్రికి వచ్చి చూపించుకోవచ్చు. దంత సమస్య ఎక్కువైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ప్రశ్న: ఇదివరకే ఉన్న వ్యాధులు చలికాలంలో రెట్టింపు అవుతాయా..?
– కుమారస్వామి అమ్మపాలెం, యుగేందర్ గార్ల, లింగ్యా మల్యాల
డాక్టర్: చలితీవ్రత పెరుగుతుండడంతో శ్వాస ఇబ్బందులు ఎదురవుతాయి. ఇదివరకే ఉన్న వ్యాధులు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. చలికి బయటకు రాకుండా ఉండాలి. వైద్యుల సలహాతో మందులు వాడాలి.
ప్రశ్న: చలికాలం ఏ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా
ఉండాలి?
– అరుణ్ కొత్తగూడ, రవి మచ్చెర్ల,
జానీ మానుకోట, వేణు సీతారాంపురం
డాక్టర్: చలికాలం ప్రతీఒక్కరు జాగ్రత్తగానే ఉండాలి. ప్రత్యేకంగా ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్య, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి.
చలికాలం.. జాగ్రత్తలు తప్పనిసరి


