డ్రమ్ సీడర్ విధానం లాభదాయకం
● తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి
● అవగాహన కల్పిస్తున్న వ్యవసాయశాఖ
గూడూరు: వరి సాగులో పెట్టుబడి వ్యయం తగ్గించి అధిక ఆదాయం పొందేందుకు వ్యవసాయ అధికారులు యాంత్రీకరణ సాగుపై దృష్టి సారించారు. ఇదే విషయంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తుండడంతో రైతులు ఈ విధానంలో వరి సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సాధారణ సాగు విధానం కన్నా డ్రమ్ సీడర్ పద్ధతులు ఎంతో లాభదాయకమని రైతులు అంటున్నారు.
4 వేల ఎకరాల్లో సాగు అంచనా..
జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో డ్రమ్ సీడర్ విధానంలో సుమారు 4 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం యాసంగి వరి సాగు కొన్ని మండలాల్లో ఆలస్యమవుతున్నందున మరో వారం రోజుల్లో సాగు పుంజుకుంటుందని చెపుతున్నారు.
ప్రయోజనాలు..
ఎకరాకు 10 నుంచి 12 కేజీల విత్తనాలు సరిపోతాయి. 24 గంటలపాటు నీటిలో నానబెట్టి, మరో 24 గంటలపాటు మండె కట్టాలి. వరి గింజ పగిలితే చాలు పంట ఎదుగుతుంది. విత్తనాలు చల్లే సమయానికి పొలంలో నీరు లేకున్నా కేవలం బురదగా ఉంటే చాలు. ఒక్కో వరుస మధ్య 20 సెంటిమీటర్ల దూరం ఉండేలా గింజలు పొలంలో పడతాయి. డ్రమ్ సీడర్‌తో ఎకరం విత్తడానికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నాటుకు 12 మందికి బదులు ఇద్దరితో పని పూర్తి చేయొచ్చు. విత్తిన నాలుగు లేదా ఐదు రోజుల తర్వాత నీరు తీసేసినపుడు టాప్ స్టార్ ఆఫ్ లీటరు నీటిలో కలిపి 20 కిలోల పొడి ఇసుకలో కలిపి పొలంలో చల్లాలి.
లాభాలు..
తక్కువ విత్తనాలు, కూలీలతో రైతు తన పొలంలో తానే విత్తుకోవచ్చు. ఏ రకమైన వరి అయినా 7 నుంచి 10 రోజుల ముందుగానే కోతకు వస్తుంది. రెండు లేదా నాలుగు క్వింటాల దిగుబడి అధికంగా వస్తుంది.


