
ఖిలా వరంగల్: గతంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఓ సమావేశం నిర్వహించాలంటే అనుమతి కోసం తెల్ల కాగితాలపై రాసి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అధికారులకు సమయం దొరికినప్పుడు అనుమతులిచ్చేవారు. ఈ విధానం నాయకులకు తలనొప్పిగా ఉండేది. ప్రస్తుతం అనుమతులు సులువుగా లభిస్తున్నాయి. దీనికి కారణం ఓ యాప్. ఎన్నికల సంఘం‘సువిధ’ అనే పేరుతో యాప్ ప్రవేశపెట్టింది. దీని వల్ల సమావేశాల అనుమతుల జారీకి అధికారుల వద్దకు వెళ్లాల్సిన పనిలేదు. యాప్‌లో దరఖాస్తు చేసుకుంటే చాలు.. అనుమతులు జారీ చేస్తారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి గురువారం నామినేషన పత్రాల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. నామిషనేషన్ల ఘట్టం పూర్తికాగానే ప్రచారం జోరుగా సాగనుంది. ప్రధాన పార్టీలు సభలు, సమావేశాలపై దృష్టి సారించనున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటారు. ర్యాలీలతో హోరెత్తిస్తారు. అయితే అభ్యర్థులు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించాలన్నా.. మందస్తు అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఇందుకు ‘సువిధ’ యాప్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
పార్లమెంట్ పరిధిలో కలెక్టర్..
వరంగల్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఒక పార్టీకి చెందిన ప్రచార వాహనం పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో తిరగాల్సి వస్తే ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించే కలెక్టర్ అనుమతిస్తారు. ప్రధాన నాయకులు హెలికాప్టర్లలో వస్తే దీని అనుమతి కలెక్టర్ వద్దే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా ‘సువిధ’ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అసెంబ్లీ పరిధిలో ఏఆర్వోలు ..
పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారానికి ఏఆర్వోలు అనుమతులు జారీ చేస్తారు. నియోజకవర్గ పరిధిలో వాహనాలు, ప్రజలతో కలిసి ర్యాలీలు, తాత్కాలిక ఎన్నికల కార్యాలయాల ఏర్పాటు, లోడ్ స్పీకర్లు , జెండాలు, పోస్టర్ల వినియోగం, ఇంటింటి ప్రచారం.. ఇలా ఏ కార్యక్రమానికికై నా అనుమతి పొందాల్సిందే.
‘సువిధ’ యాప్‌లో ఇలా దరఖాస్తు చేసుకోవాలి..
సెల్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ‘సువిధ’ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
సమావేశం నిర్వహించే వివరాలతో పాటు తమకు ఏ విధమైన అనుమతులు కావాలో అందులో నమోదు చేయాలి.
అనుమతులకు సంబంధించి మీసేవ కేంద్రంలో చలాన్ చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన చలాన్ రసీదు, ‘సువిధ’ యాప్‌లో నమోదు చేసిన వివరాలు రిటర్నింగ్ అధికారికి, అసెంబ్లీ పరిధిలోని ఏఆర్వో కార్యాలయాల్లో అందజేయాలి.
ఎలాంటి జాప్యం లేకుండా దరఖాస్తులు ఎన్నికల అధికారులకు చేరిన 48 గంటల్లోనే అనుమతులు జారీ చేస్తారు.
అనుమతి జారీలో జాప్యం జరిగితే సంబంధిత రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవచ్చు.
‘సువిధ’ యాప్‌తో సులభం..
48 గంటల్లోనే అనుమతులు
గతంలో కార్యాలయాల
చుట్టూ తిరిగే పరిస్థితి..
నేడు అంతా ఆన్‌లైన్‌లోనే..