హామీల అమలేది..?
● బయ్యారం పెద్దచెరువును పట్టించుకోని ప్రజాప్రతినిధులు
● పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ
● ప్రస్తుతం ఊసెత్తని పాలకులు
బయ్యారం: కాకతీయరాణి బయ్యామాంబ నిర్మించిన బయ్యారం పెద్ద చెరువును అభివృద్ధి చేయడంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రెండుగుట్టల అందాల నడుమ ఉన్న బయ్యారం పెద్దచెరువు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేస్తామని గత ప్రభుత్వంలో జిల్లా మంత్రిగా కొనసాగిన సత్యవతిరాథోడ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు పగటి కలలుగానే మిగిలిపోయాయి. సంవత్సరాలు గడుస్తున్నా.. చెరువు అభివృద్ధిపై పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెండుగుట్టలే చెరువుకట్ట..
కాకతీయరాణి బయ్యామాంబ పాలనలో రెండుగుట్టల నడుమ బయ్యారం పెద్ద చెరువును నిర్మించారు. 16.2 అడుగుల నీటిసామర్థ్యం గల పెద్దచెరువు బయ్యారం, గార్ల మండలాల పరిధిలోని పలు గ్రామాల రైతులకు సాగునీటిని అందిస్తోంది. ఎక్కడ కరువు వచ్చినా.. చెరువు కింద మాత్రం పంటలు పండుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు.
కట్టపై శిలాశాసనం..
కాకతీయరాజుల వంశచరిత్ర ఆధారంగా అప్పటి కాకతీయరాణి బయ్యామాంబ బయ్యారం పెద్దచెరువు కట్టపై శిలాశాసనం ఏర్పాటు చేయించారు. ఈ శాసనంపై ఓరుగల్లును రాజధానిగా చేసుకొని పాలించిన కాకతీయరాజుల వంశచరిత్రను వివరించారు. కాకతీయుల వంశచర్రితను తెలిపే శాసనం బయ్యారం చెరువుకట్టపైనే ఉందని చరిత్ర తెలుపుతోంది.
అలుగుల కనువిందు..
ప్రతీ వర్షాకాలంలో చెరువు నిండి అలుగుల నుంచి వచ్చే నీటి అందాలు చూపరులను ఆకట్టుకుంటాయి. జూన్ నుంచి ఆగస్టు వరకు వర్షాలను బట్టి చెరువులో పూర్తిస్థాయి నీరు చేరుతుంది. అలుగుల ద్వారా వచ్చే నీటి అందాలను చూసేందుకు మండలంలోని పలు గ్రామాల వాసులతో పాటు మహబూబాబాద్, కురవి, గూడూరు, గార్ల, డోర్నకల్, భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలానికి చెందిన పర్యాటకులు వస్తుంటారు. ఇప్పటికై నా బయ్యారం పెద్దచెరువును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పర్యాటకంగా అభివృద్ధి చేయాలి
కోటగడ్డ పంచాయతీ పరిధిలో పచ్చనిచెట్లు, కనుచూపు మేర నీటితో కనపడే బయ్యారం పెద్దచెరువు వద్దకు ప్రతీ సీజన్‌లో పర్యాటకులు వస్తుంటారు. చెరువులో నీటిని నిల్వ చేసి బోటింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. చెరువు కట్ట నుంచి అలుగుల వరకు పర్యాటకంగా అభివృద్ధి చేయాలి.
–కె.వరలక్ష్మి, సర్పంచ్, కోటగడ్డ
హామీల అమలేది..?
హామీల అమలేది..?


