మున్నేరు టు పాలేరు
సాక్షి, మహబూబాబాద్: మానుకోట జిల్లా మీదుగా ప్రవహించే మున్నేరు వాగుపై గార్ల మండలం దుబ్బగూడెంలో అడ్డుకట్ట వేసి నీటిని దారి మళ్లించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. డోర్నకల్ మండలం నుంచి వెళ్తున్న సీతారామ ప్రాజెక్టు ద్వారా పాలేరుకు నీటిని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈమేరకు నిధుల మంజూరు, కాల్వల భూసేకరణ పనిలో ఉన్నారు. అయితే వాగు దారి మళ్లిస్తే తమ ప్రాంతం ఎడారిగా మారుతుందని, భూమి ఇచ్చే ప్రసక్తే లేదని గార్ల రైతులు మొండికేస్తున్నారు. ప్రతీ ఏటా వృథాగా సముద్రంలో కలిసే నీటినే పాలేరుకు మళ్లిస్తున్నామని అధికారులు చెబుతుండగా.. రైతులు మాత్రం వినకుండా ఆందోళన బాట పట్టారు.
పాలేరుకు ఇలా..
ఎగువన ఉన్న ములుగు, వరంగల్ జిల్లాల మీదుగా మహబూబాబాద్ జిల్లాలో మున్నేరు వాగు ప్రవహిస్తూ ఖమ్మం జిల్లా మీదుగా కృష్ణా నదిలో కలుస్తుంది. అయితే గార్ల మండలంలోని దుబ్గగూడెం వద్ద చెక్ డ్యాం నిర్మించి సుమారు 10 కిలోమీటర్ల మేరకు కాల్వలు తవ్వి డోర్నకల్ పట్టణం సమీపం నుంచి వెళ్తున్న సీతారామ ప్రాజెక్టు కాల్వలో కలుపుతారు. ఇందుకోసం రూ.145 కోట్లు అవసరమని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ కాల్వలు తవ్వడానికి 350 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. కాగా పనులు పూర్తయితే మున్నేరు వాగు ద్వారా 10 నుంచి 12 టీఎంసీల నీటిని పాలేరులోకి తరలించవచ్చు.
భూములు ఇవ్వమంటున్న రైతులు..
మున్నేరు నీటిని పాలేరుకు తరలించే కాల్వల కోసం 350 ఎకరాల భూమి అవసరం. అయితే ఈ భూమి ఇవ్వం.. కాల్వ తవ్వవద్దని రైతులు ఆందోళన చేస్తున్నారు. మున్నేరు దారి మళ్లించడం ద్వారా గార్ల, డోర్నకల్ మండలాల్లోని రాంపురం, పాత దుబ్బతండా, కొత్త దుబ్బతండా, సత్యతండా, గుర్రాలకుంట తండా, అమ్మపాలెం, తహసీల్దార్ బంజర, సీతారాంపురంలోని ఎనిమిది చెక్ డ్యాంలతోపాటు, ఖమ్మం రూరల్ మండలం పొలిశెట్టిగూడెం సరిహద్దుల్లో ఉన్న రెండు చెక్ డ్యాంలు, డోర్నకల్ పట్టణ శివారులోని ఆనకట్టకు నీటి ప్రవాహం తగ్గే అవకాశం ఉంది. దీంతో ఈ చెక్‌డ్యాంల నీటినే ఆధారంగా చేసుకొని సాగుచేసే సుమారు 5వేల ఎకరాలకు నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఒక వేళ భూములు తప్పని సరిగా ఇవ్వాల్సి వస్తే ప్రభుత్వం ఎకరానికి రూ. 12లక్షలకు మించి ఇచ్చే అవకాశం లేదని ప్రచారం. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరానికి రూ. 20లక్షల నుంచి రూ. 40లక్షల మేరకు ధర పలుకుతోంది. ఇన్ని కారణాలతో అసలు భూమి ఇవ్వం, కాల్వల నిర్మాణాన్ని అడ్డుకుంటామని రైతులు తేల్చి చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల భూ సేకరణకు వచ్చిన అధికారులను అడ్డుకొని సర్వే చేయకుండానే వెనక్కి పంపించారు.
వాగు దారి మళ్లించి
పాలేరుకు నీటి తరలింపు
గార్ల మండలం దుబ్బగూడెంలో
చెక్‌డ్యాం నిర్మాణం
మిగులు జలాలే తరలిస్తున్నామంటున్న అధికారులు
కాల్వల నిర్మాణ భూసేకరణకు
రైతుల ససేమిరా
మా నీళ్లు మళ్లించొద్దని రైతులు,
రైతు సంఘాల ఆందోళన


