మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు
● ఓటరు జాబితా షెడ్యూల్ విడుదల
● ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శన
● ఈనెల 10న ఓటరు తుది జాబితా వెల్లడి
● సర్వం సిద్ధం చేస్తున్న యంత్రాంగం
మహబూబాబాద్: త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈమేరకు ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీకుముదిని ఓటరు జాబితా షెడ్యూల్ విడుదల చేశారు. ఈసీఐ (ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా) ఆదేశాల మేరకు తొలుత ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్లు, ఇతర జాబితా తయారు చేసే పనిలో మున్సిపల్ అధికారులు నిమగ్నమయ్యారు. ఈనెల 10న ఓటరు తుది జాబితా ప్రదర్శిస్తారు. కాగా, మున్సిపాలిటీల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది.
మానుకోటలో 36 వార్డులు..
మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులు ఉన్నాయి. గత మున్సిపల్ ఎన్నికల జాబితా ప్రకారం 57,828 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు జాబితా ఆధారంగా ఓటరు జాబితా సిద్ధం చేయాలని ఈసీఐ ఆదేశించింది. 01–10–2025 నాటి డేటా ఆధారంగా మున్సిపల్ వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటరు జాబితా తయారు చేయాలని గైడ్ లైన్స్‌లో పొందుపర్చారు.
వార్డుల వారీగా ఓటరు జాబితా..
డిసెంబర్ 29న విడుదలైన షెడ్యూల్ ప్రకారం.. 30,31 తేదీల్లో వార్డుల వారీగా ఓటరు జాబితా, పీఎస్‌ల వారీగా వార్డుల జాబితా తయారు చేశారు. మున్సిపాలిటీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వార్డు ఆఫీసర్లు, ఆర్‌ఐ, మేనేజర్ టౌన్ ప్లానింగ్ అధికారులంతా ఆ పనిలో నిమగ్నమయ్యారు. పనులను కమిషనర్ టి.రాజేశ్వర్ పర్యవేక్షిస్తున్నారు.
● ఈనెల 1న ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శించారు. ఆరోజు నుంచే అభ్యంతరాల స్వీకరణ ప్రారంభమవుతుందని అధికారులు తెలి పారు. కాగా, ఈనెల 4వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు.
● ఈనెల 5న మున్సిపాలిటీల పరిధిలోని రాజకీయ నాయకులతో ఓటరు జాబితా, పీఎస్‌లపై సమావేశం, 6న కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు.
● ఈనెల 10న తుది ఓటరు జాబితా ప్రదర్శిస్తారు. అనంతరం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మిగిలిన ప్రక్రియ పూర్తి చేయనున్నారు. తదుపరి రిజర్వేషన్లు, ఇతర ప్రక్రియ అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. కాగా మానుకోట మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ ఎస్టీకి కేటా యించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
పెరిగిన ఓటర్లు..
గత ఎన్నికల్లో మానుకోట మున్సిపాలిటీలో 57,828 మంది ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం ముసాయిదా జాబితా ప్రకారం 65,851మంది ఓటర్లు ఉన్నారు. ఈమేరకు గతంలో కంటే 8,023 మంది ఓటర్లు పెరిగారు. దీంతో వార్డులు పెరగడం, పరిధి కూడా మారే పరిస్థితి ఉంది. దీంతో రిజర్వేషన్లు కూడా మారే అవకాశాలు ఉన్నాయి. కాగా చైర్మన్ రిజర్వేషన్ బీసీకి కేటాయించాలని చాలామంది రాజకీయ నాయకులు ఆశిస్తున్నాయి. అయితే ఎస్టీకి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది.
మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు


