
కొత్తగూడ: ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ యూనియన్(టీడబ్ల్యూటీయూ) రాష్ట్ర అధ్యక్షుడిగా మండలంలోని వేలుబెల్లి గ్రామానికి చెందిన వజ్జ సురేందర్ ఎన్నికయ్యారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి క్రియాశీలకంగా పని చేస్తున్న సురేందర్‌ను సంఘం సభ్యులు హనుమకొండలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆయన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.
ముగిసిన ఓపెన్ టెన్త్,
ఇంటర్ ప్రవేశాలు
విద్యారణ్యపురి : తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్‌లో ఈ విద్యాసంవత్సరం 2023–2024లో పది, ఇంటర్‌లో అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 105 అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. (ప్రభుత్వ, జిల్లా పరిషత్ హైస్కూళ్లు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు) హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్‌లో ప్రవేశాలు నిర్వహించారు. టెన్త్‌లో 2,274 మంది, ఇంటర్‌లో 3,807మంది మొత్తం 6,081మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు.
జిల్లాలవారీగా అడ్మిషన్ల వివరాలు..
హనుమకొండ జిల్లాలో టెన్త్‌లో 407మంది, ఇంటర్‌లో 279 కలిపి 1,186మంది విద్యార్థులు, వరంగల్ జిల్లాలో టెన్త్‌లో 354మంది, ఇంటర్‌లో 815 మొత్తంగా 1,169 మంది, మహబూబాబాద్ జిల్లాలో టెన్త్‌లో 483 మంది, ఇంటర్‌లో 592 కలిపి 1,075 మంది, జనగామ జిల్లాలో టెన్త్‌లో 276 మంది, ఇంటర్‌లో 636 మంది మొత్తంగా 912 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో టెన్త్‌లో 225 మంది, ఇంటర్‌లో 354 మంది మొత్తంగా 579 మంది విద్యార్థులు, ములుగు జిల్లాలో టెన్త్‌లో 529 మంది, ఇంటర్‌లో 631మంది కలిపి 1,160మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారని ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ మురాల శంకర్‌రావు తెలిపారు. అకాడమిక్ ఇయర్‌లో విద్యార్థులకు 30 క్లాస్‌లుంటాయని తెలిపారు. ప్రతి ఆదివారం, రెండో శనివారం సెలవుదినాల్లో తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తియినందున స్టడీ మెటీరియల్ అందిస్తామని తెలిపారు.
సామాన్య భక్తులకు
భారమే!
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో సామాన్య భక్తులకు అభిషేక పూజలు భారంగా మారాయి. కార్తీకమాసం నెల నుంచి ఆలయంలో రూ.300 అభిషేక టికెట్ల పూజలను రద్దు చేసినట్లు తెలిసింది. ఈ టికెట్లు తీసుకున్న భక్తులకు అభిషేక మంటపంలో సామూహికంగా పూజలు చేసిన అనంతరం గర్భగుడిలో స్వామివారి లింగాలకు అభిషేకం చేస్తారు. కానీ రద్దీ ఎక్కువగా ఉంటుండడంతో రూ.300 టికెట్లు నిలిపి వేశారు. దీంతో రూ.1000 టికెట్లపై అధికారులు దృష్టిసారించడంతో సామాన్య భక్తులకు అభిషేక పూజలు చేసుకోవడానికి వీలులేకుండా పోయింది. కొంతమంది చేసేదేమీ లేక రూ.1000 టికెట్ తీసుకొని అభిషేక పూజలు చేసుకుంటున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో మరి కొంతమంది భక్తులు మాత్రం ఉచిత దర్శనంతో స్వామివారికి అభిషేక పూజలు చేయకుండానే దర్శనం చేసుకొని తిరిగి వెళ్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉంటే ఆదాయం కన్నా ప్రత్యామ్నాయ మార్గాలను అధికారులు చూడాలి కానీ ఇలా రద్దు చేసి సామాన్యులకు ఇబ్బందులు కలిగించడం ఎందుకని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఆలయ పాలకవర్గం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. రూ.300 అభిషేక టికెట్లు పునరుద్ధరించాలని పలువురు సామాన్య భక్తులు కోరుతున్నారు.
కాళేశ్వరాలయ వేళల్లో తాత్కాలిక మార్పు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ వేళల్లో తాత్కాలికంగా మార్పు చేసినట్లు ఈఓ మహేష్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం నుంచి నెల రోజుల పాటు ఉదయం 6:30గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు తిరిగి సాయంత్రం 4:30గంటల నుంచి 6:30గంటల వరకు గర్భగుడిలో అభిషేక పూజలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.