సంక్రాంతిలోగా పనులు కావాలి
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర అభివృద్ధి పనులను సంక్రాంతి పండుగలోగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి సీతక్క, ఎంపీ బలరాంనాయక్, కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి ఆయా శాఖల అధికారులు, కాంట్రాక్టర్లతో జాతర అభివృద్ధి పనుల పురోగతిపై ఆదివారం మేడారంలో సమీక్ష నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణ పనుల ఆలస్యంతో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ ప్రాకారం పీటీ బీం ఏర్పాటు, గద్దెల రాతి స్తంభాలపై బ్రాకెట్లను త్వరగా ఏర్పాటు చేయాలని, సివిల్ పనులు, క్యూలైన్ షెడ్ల నిర్మాణ పనులు జనవరి 12వ తేదీ వరకు పూర్తి చేయాలని, రహదారులకు ఇరువైపులా సైడ్‌బర్మ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతరలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జనవరి 31 వరకు విద్యుత్ కాంతుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, జాతర పరిసరాల్లో జోన్లు, సెక్టార్ల వారీగా సిబ్బందిని నియమించుకుని పారిశుద్ధ్య పనులు చేపట్టాలని పేర్కొన్నారు. ఆదివాసీ సంప్రదాయానికి పెద్దపీట వేసి, కనీవిని ఎరుగుని రీతిలో జాతర నిర్వహించాలని సూచించారు.
పనులను పరిశీలిస్తూ ఆదేశాలు..
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధనసరి సీతక్క.. అధికారులతో కలిసి మేడారంలో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ల్యాండ్ స్కిప్పింగ్, ప్రధాన ఆర్చ్, హరిత హోటల్ సుందరీకరణ, రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. జంపన్నవాగులో లెవలింగ్ పనులను పరిశీలించి నీటినిల్వ లభ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేడారంలో ఆదివాసీ మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాంబు చికెన్ క్యాంటీన్ ప్రారంభించారు. చికెన్ రుచి చూసి మహిళలను మెచ్చుకున్నారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, ఎస్పీలు శబరీష్, సిరిశెట్టి సంకీర్త్, ఏఎస్పీ మానన్ భట్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్‌జీ, ఓఎస్‌డీ శివం ఉపాధ్యాయ, మార్కెట్ చైర్ పర్సన్ రేగ కల్యాణి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు తదితరులు పాల్గొన్నారు.
కనీవిని ఎరుగని రీతిలో
మేడారం జాతర నిర్వహణ
ఆదివాసీ సంప్రదాయానికి పెద్దపీట
సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హాజరైన మంత్రి సీతక్క,
ఎంపీ బలరాంనాయక్, అధికారులు
సంక్రాంతిలోగా పనులు కావాలి


