జనగామ : పోరాటాల ఖిల్లా.. ఆత్మగౌరవ బావుట.. పౌరుశానికి ప్రతీక.. ధీరత్వం కలిగిన ప్రాంతం జనగామ. ఇక్కడి ప్రజలు నిత్య చైత్యన వంతులు. ఏ ఘటన జరిగినా వెంటనే స్పందిస్తారు. పాలకుల తప్పులు ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతారు. ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా పాలించే నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అందుకే అందుకే జనగామకు రాష్ట్రంలో ప్రత్యేకత గుర్తింపు ఉంది. దీంతో ఈ నియోజవర్గంపై పట్టు సాధించేందుకు ఆయా పార్టీలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాయి. ఈ నేపథ్యంలో జనగామ నియోజకవర్గం ఎప్పడు ఏర్పడింది? ఈ నియోజవకవర్గంపై ఇప్పటి వరకూ ఎక్కువ కాలం పాలించిన పార్టీలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
కాంగి‘రేస్’ విజయం ..
జనగామ నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ అత్యధిక విజయాలు తన ఖాతాలో వేసుకుంది. 1952లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 15 దఫాలుగా ఎన్నికలు జరిగాయి. ఇందులో తొమ్మిది దఫాలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సీపీఎం పది సంవత్సరాలు, పీడీఎఫ్, టీడీపీ, సీపీఐ చెరో ఐదేళ్లు, బీఆర్‌ఎస్ వరుసగా రెండు పర్యాయాలు గెలుపొందింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 45 సంవత్సరాలు అధికారంలో ఉంటే, అందులో పొన్నాల లక్ష్మయ్య రెండు దశాబ్దాలు జనగామను పాలించారు. పదిహేనేళ్ల పాటు సహాయ, కేబినెట్ మంత్రి పదవులు చేపట్టారు.
మార్పులు.. చేర్పులు
జనగామ నియోజకవర్గంలో జనగామ మండలం మినహాయించి మిగతా మండలాలన్నీ కొత్తవే. 2009 ఎన్నికల సమయంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో జనగామ స్వరూపం పూర్తిగా మారింది. చేర్యాల నియోజకవర్గం కనుమరుగుకావడంతో అందులోని చేర్యాల, మద్దూరు, నర్మెట, బచ్చన్నపేట మండలాలు జనగామలో విలీనం చేశారు. అంతకు ముందు జనగామలో ఉన్న రఘునాథపల్లి, లింగాలఘణపురం మండలాలు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో కలవగా, దేవరుప్పుల మండలం పాలకుర్తిలో కలిసింది. ఈ నేపథ్యంలో జనగామ ని యోజకవర్గానికి కొత్త స్వరూపం సంతరించుకుంది. దీంతో మారిన స్వరూపంతో పొన్నాల స్థానికేతర నియోజకవర్గం నుంచి బరిలో దిగాల్సి వచ్చింది. ఎందుకంటే పొన్నా ల సొంత గ్రామం రఘునాథపల్లి మండలం ఖిలాషా పురం. ఇది స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఉంది.
‘పొన్నాల’దే పై‘చేయి’..
1989లో పొన్నాల లక్ష్మయ్య మొదటిసారి జనగామ ఎమ్మెల్యేగా విజయం సాధించి, అప్పటి సీఎం నేదుమల్లి జనార్దన్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా బాధ్యలు చేపట్టారు. అలాగే, 1999, 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. నాటి ముఖ్యమంత్రులు వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి హయాంలో పదేళ్లు మంత్రి పదవిలో కొనసాగారు. ఇక్కడ నుంచి ఎన్నికై న వారిలో అత్యధిక కాలం మంత్రి పదవి చేపట్టిన ఘనత కూడా ఈయనకే దక్కింది. నియోజకవర్గ చరిత్రలో అత్యధిక కాలం ఎమ్మెల్యేగా పనిచేసిన రికార్డు ఉన్న పొన్నాల.. 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో వరుసగా రెండు దఫాలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఓడిపోయారు.
కమాలుద్దీన్‌కు కలిసొచ్చింది..
జనగామ నియోజకవర్గం నుంచి 1967లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎండీ కమాలుద్దీన్ అహ్మద్ రాజకీయ జీవితం ఓ మైలురాయి. రాష్ట్ర, కేంద్ర మంత్రి పదవులతో పాటు చేర్యాల ఎమ్మెల్యే, పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన అతను.. సౌదీఅరేబియాలో భారత రాయబారిగా పని చేశారు. అంతకు ముందు వరంగల్, హనుమకొండ నుంచి మూడు దఫాలు లోక్‌సభకు ఎన్నికయ్యారు.
సంతోషం.. స్వల్పం
1962లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గోక రామలింగం 14 ఓట్ల అత్యల్ప మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి సీపీఐకి చెందిన కె.రాఘవులుపై గెలుపొందారు. 2009లో ఎన్నికల్లో తన సమీప బీఆర్‌ఎస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిపై కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన పొన్నాల కేవలం 236 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 2,09,382 ఓట్లు నమోదుకాగా, 1,51,269 ఓట్లు పోలయ్యాయి. వీటిలో పొన్నాలకు 61,218 ఓట్లు రాగా.. కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి 60,982 ఓట్లు వచ్చాయి. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 32 వేలపై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కువ శాతం కాంగ్రెస్ ఓట్లకు గండికొట్టారు.
ద్విసభ అవకాశం..
1957లో జనగామ నియోజకవర్గం ద్విసభ స్థానంగా ఉంది. దీంతో ఆ సమయంలో పీడీఎఫ్‌కు చెందిన జి.గోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన గోక రామలింగం ఎమ్మెల్యేలుగా పని చేశారు.
సీటు.. ఫట్.
1962లో గోక రామలింగం ఎన్నికపై ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి రాఘవులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా , వాదనలు విన్న అనంతరం కోర్టు రామలింగం ఎన్నికను కొట్టివేసింది. రాఘవులు ఎన్నికై నట్లు తీర్పు వెలువరించింది.
చేర్యాలదీ ప్రత్యేకమే..
జనగామ నియోజకవర్గంలో కలిసి కనుమరుగైన చేర్యాలదీ ప్రత్యేకస్థానమే. 1962లో ఏర్పడిన ఈ నియోజకవర్గం 2009 ఎన్నికల్లో రద్దయింది. ఈ కాలంలో 11 సార్లు ఎన్నికలు జరగగా చెరో నాలుగుసార్లు టీడీపీ, కాంగ్రెస్, ఒకసారి సీపీఐ, రెండు సార్లు బీఆర్‌ఎస్ గెలిచాయి. 1962లో కాంగ్రెస్‌కు చెందిన కమాలుద్దీన్, 1967లో సీపీఐకి చెందిన అబ్రహం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1972, 1978లో కాంగ్రెస్‌కు చెందిన పి.కాటం లింగయ్య, గొర్రె సిద్ధయ్య ఎన్నికయ్యారు. 1983, 1985, 1989, 1994లో టీడీపీకి చెందిన నిమ్మ రాజిరెడ్డి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు సృష్టించారు. అంతే కాకుండా ఈయన 1989లోఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా కూడా పని చేశారు. అనంతరం 1999లో కాంగ్రెస్‌కు చెందిన నా గపురి రాజలింగం, 2004 రెగ్యులర్, 2008 ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు చెందిన కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఎమ్మెల్యేగా గె లుపొందారు. 2009లో ఏర్పాటైన జనగామ నియోజకవర్గంలో పొన్నాల లక్ష్మయ్య.. ముత్తిరెడ్డిపై విజయం సాధించిన విషయం తెలిసిందే. 2023లో జరిగే సాధారణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరుఫున పల్లా రాజేశ్వర్‌రెడ్డి బరిలో నిలువగా, కాంగ్రెస్, బీజేపీ నుంచి టికెట్లు ఇంకా ఖరారు కాలేదు.
జనగామ, చేర్యాల నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్యేలు
ఇప్పటివరకు గెలిచిన ఎమ్మెల్యేలు వీరే...
సంవత్సరం గెలిచిన వారు పార్టీ సమీప ప్రత్యర్థి పార్టీ
1952 సయిద్ ఏ హుస్సేన్ పీడీఎఫ్ మహ్మద్ అబిద్ కాంగ్రెస్
1957 (ద్వి) గోక రామలింగం కాంగ్రెస్ కె. రాఘవులు పీడీఎఫ్
జి.గోపాల రెడ్డి పీడీఎఫ్ జె.రెడ్డి కాంగ్రెస్
1962 గోక రామలింగం కాంగ్రెస్ కె. రాఘవులు సీపీఐ
1962–67 రాఘవులు సీపీఐ కోర్టు తీర్పు ద్వారా ఎన్నిక
1967 ఎండీ కమాలుద్దీన్ కాంగ్రెస్ నర్సింహారెడ్డి సీపీఎం
1972 కె. నారాయణ కాంగ్రెస్ డీఎస్‌ఆర్ రెడ్డి ఇండిపెండెంట్
1978 కె. వరదారెడ్డి కాంగ్రెస్(ఐ) ఎ. నర్సింహారెడ్డి సీపీఎం
1983 ఆర్.లక్ష్మారెడ్డి టీడీపీ కె. వరదారెడ్డి కాంగ్రెస్
1985 అసిరెడ్డి నర్సింహారెడ్డి సీపీఎం పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్
1989 పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ చరగొండి రాజారెడ్డి సీపీఎం
1994 చరగొండి రాజారెడ్డి సీపీఎం పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్
1999 పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ జి. ప్రేమలతారెడ్డి టీడీపీ
2004 పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ బస్వారెడ్డి టీడీపీ
2009 పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి టీఆర్‌ఎస్
2014 ముత్తిరెడ్డి యాదగిరి రెడి టీఆర్‌ఎస్ పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్
2018 ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి టీఆర్‌ఎస్ పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్
నియోజకవర్గాల పునర్విభజనతో మారిన జనగామ స్వరూపం..
కనుమరుగైన చేర్యాల కానిస్టెన్సీ
సిద్దిపేట జిల్లాలో నియోజకవర్గ మండలాలు
15 సార్లు ఎన్నికలు..నాలుగు దఫాలు గెలిచిన పొన్నాల, నిమ్మ రాజిరెడ్డి
పి.లక్ష్మయ్య (కాంగ్రెస్)
రాజలింగం (కాంగ్రెస్)
కమాలొద్దీన్ (కాంగ్రెస్)
లింగయ్య (కాంగ్రెస్)
గొర్రె సిద్ధయ్య(కాంగ్రెస్)
రాజారెడ్డి (సీపీఎం)
గోపాల్‌రెడ్డి (పీడీఎఫ్)
ప్రతాప్‌రెడ్డి (బీఆర్‌ఎస్)
ముత్తిరెడ్డి (బీఆర్‌ఎస్)
ఏసిరెడ్డి నర్సింహారెడ్డి


