మెనూ ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

మెనూ ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలి

Nov 21 2026 2:44 AM | Updated on Nov 21 2026 2:44 AM

కర్నూలు(అర్బన్‌): హెచ్‌పీటీఎస్‌ యాప్‌లో ప్రతి రోజు విద్యార్థులకు పెడుతున్న మెనూ ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలని జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి కె.ప్రసూన ఆదేశించారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో జిల్లాకు చెందిన సహాయ బీసీ సంక్షేమాధికారులు, వసతి గృహ సంక్షేమాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వసతి గృహాల్లో సురక్షితమైన ఆహార నిర్వహణ పద్ధతులు పాటించాలన్నారు. హెచ్‌డబ్ల్యూఓలు తాము విధులు నిర్వహిస్తున్న హాస్టల్‌ ప్రాంతాల్లోనే ఉండాలని, ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరును ప్రతి రోజు క్రమం తప్పకుండా వేయాలన్నారు. వసతి గృహాల్లోని విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. సహాయ బీసీ సంక్షేమాధికారులు తమ పరిధిలోని హాస్టళ్లను తనిఖీలు చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.

పోలింగ్‌ ప్రాంతాల్లో స్థానిక సెలవు

కర్నూలు(సెంట్రల్‌): గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ రోజున గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సెలవు ప్రకటించినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి తెలిపారు. గ్రామ పంచాయతీల సర్పంచ్‌, వార్డు సభ్యుల పదవులకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో నవంబర్‌ 26, నవంబర్‌ 29.. డిసెంబర్‌ 2వ తేదీల్లో పోలింగ్‌ జరగనుందన్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్‌ జరిగే సంబంధిత గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు ఆయా పోలింగ్‌ తేదీల్లో స్థానిక సెలవు వర్తిస్తుందన్నారు.

అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు

కర్నూలు: అధికారులు, సిబ్బందిపై అవినీతి అక్రమాల ఆరోపణలు వస్తే శాఖాపరమైన విచారణ జరిపి నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎకై ్సజ్‌ శాఖ ఈఎస్‌ ఎం.సుధీర్‌ బాబు అన్నారు. ‘మీకు అంతనా.. మాకు ఇంతేనా’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో వెలువడిన కథనంపై స్పందించిన ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా ఎకై ్సజ్‌ శాఖలో పనిచేస్తున్న వారిపై ఫిర్యాదులు ఉన్నట్లయితే వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. పరిశీలనలో వాస్తవాలు నిర్ధారించిన అనంతరం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం దుకాణాలు, బార్లు, ఇతర లైసెన్స్‌దారుల కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

హెచ్‌ఆర్‌సీ భవన అద్దెకు రూ.14.73 లక్షలు మంజూరు

కర్నూలు(సెంట్రల్‌): కర్నూలులోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్‌సీ)కి సంబంధించి ప్రైవేట్‌ బిల్డింగ్‌ అద్దెను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి 2026 నవంబర్‌ నుంచి 2027 జనవరి వరకు సంబంధించి అద్దె కింద రూ.14,73,615 విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి జి.సాయిప్రసాదు జీఓ 2177 విడుదల చేశారు. అలాగే లోకాయుక్త బిల్డింగ్‌కు సంబంధించి 01.02.2022 నుంచి 31.01.2024 పెండింగ్‌లోని జీఎస్టీ, మెయింటెనెన్స్‌ చార్జీల కింద కూడా ప్రభుత్వం రూ.30,05,448 విడదుల చేసింది.

ఉపాధి అక్రమాలపై లోతుగా విచారణ

కర్నూలు(అగ్రికల్చర్‌): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, వీబీ జీ రామ్‌ జీ కింద తుగ్గలి మండలంలో చేపట్టిన పనుల్లో అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ నరసింహారెడ్డి తెలిపారు. అక్రమాలకు సంబంధించి ఇప్పటికే ఫీల్డ్‌ అసిస్టెంట్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌లను విధుల నుంచి తొలగించామన్నారు. అంబుడ్స్‌మన్‌ కూడా విచారణ జరుపుతున్నారని, మరింత లోతుగా విచారణ జరిపేందుకు తుగ్గలి మండలానికి ప్రత్యేక సోషల్‌ ఆడిట్‌ బృందాన్ని పంపాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ను కోరామన్నారు. అన్ని వైపుల నుంచి అక్రమాలపై నిఘా పెంచడంతో లేబర్‌ రిపోర్ట్‌ కూడా తగ్గిందన్నారు. ఇదివరకు లేబర్‌ రిపోర్టులో తుగ్గలి మండలం రాష్ట్రంలోనే మొదటి నాలుగైదు స్థానాల్లో ఉండేదని, అక్రమాలపై ఉక్కుపాదం మోపుతుండటంతో లేబర్‌ రిపోర్టులో అట్టడుగు నుంచి రెండవ స్థానానికి పడిపోయిందన్నారు. ఇదిలాఉంటే అక్రమాలపై ‘సాక్షి’లో వరుస కథనాలు వస్తుండటంతో ఉన్నతస్థాయి విచారణ అధికారులు నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement