25 కిలోల బస్తా రూ.2,400పైనే
కర్నూలు(అగ్రికల్చర్): బియ్యం ధరలు మండిపోతున్న తరుణంతో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ సరఫరా చేస్తున్న బియ్యానికి విపరీమైన డిమాండ్ ఏర్పడింది. రైతుబజార్ల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యంలో నాణ్యత లేకపోయినప్పటికీ కాస్త తక్కువ ధరకే లభిస్తుండటంతో వినియోగదారులు పోటీపడుతున్నారు. బియ్యం కొరత లేనప్పటికీ వ్యాపారులు, దళారీలు, మిల్లర్లు సృష్టించిన కృత్రిమ కొరత ధరల పెరుగుదలకు కారణమవుతోంది. బియ్యం ధరపై సర్వత్రా ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థ ద్వారా 26 కిలోల బియ్యం ప్యాకెట్‌ను రూ.1,300 ప్రకారం పంపిణీ చేస్తోంది. ఇది కూడా జిల్లా కేంద్రానికే పరిమితం చేసింది. ఈ బియ్యంలో 30 శాతం లావు బియ్యం కల్తీ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గోదాముల్లో ధాన్యం నిల్వలు
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గోదాముల్లో 2024–25, 2025–26 సంవత్సరాల్లో పండిన ధాన్యం వేల టన్నులు ఉండిపోయింది. వీటిని దళారీలు, మిల్లర్లు, వ్యాపారులు బ్లాక్ చేశారు. ఈ సారి ఎల్‌నినో తీవ్రత ఎక్కువగా ఉందని, నీళ్లు లేనందున వరి వేయవద్దని బహిరంగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు సూచించిన తర్వాతే ధాన్యం గోదాముల్లోనే ఉండిపోయింది. అంతకు ముందు క్వింటా బియ్యం ధర రూ.5,500 వరకు మాత్రమే ఉంది. చంద్రబాబు వరి సాగు చేయవద్దని ప్రకటించిన తర్వాతే దళారీలు, మిల్లర్లు యథేచ్ఛగా బియ్యం ధరలు పెంచేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. నేడు 25 కిలోల బస్తా బియ్యం ప్యాకెట్ ధర రూ.2,300 నుంచి రూ.2,400 వరకు చేరిందంటే ఇందుకు చంద్రబాబు సర్కారే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వరి సాగు చేయవద్దని
సీఎం చెప్పడంతోనే ధరల పెరుగుదల
గోదాముల్లో నిల్వలు..
మార్కెట్‌లో కృత్రిమ కొరత
ప్రస్తుతం రైతుబజార్లలో
రూ.1,300 చొప్పున పంపిణీ
నాణ్యతపై పెదవి విరుస్తున్న
వినియోగదారులు


