నేడు ఎన్నికల అధికారులకు శిక్షణ | - | Sakshi
Sakshi News home page

నేడు ఎన్నికల అధికారులకు శిక్షణ

Oct 25 2026 12:11 AM | Updated on Oct 25 2026 12:11 AM

కర్నూలు(సెంట్రల్‌): మునిసిపల్‌ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు ఆదివారం శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని కర్నూలు నగర పాలక సంస్థతోపాటు ఆదోని, ఎమ్మిగనూరు మునిసిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీ ఎన్నికల విధుల్లో మొత్తం 5,427 మంది అధికారులు పాల్గొంటారు. వీరికి ఆయా మునిసిపల్‌ కేంద్రాల్లో శిక్షణ ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కర్నూలు నగర పాలక సంస్థకు సంబంధించి కర్నూలులోని టౌన్‌ మోడల్‌ జూనియర్‌ కాలేజీ, ఆదోనికి సంబంధించి ఆదోని నెహ్రూ మెమోరియల్‌ ఉన్నత పాఠశాల, ఎమ్మిగనూరుకు సంబంధించి ఎమ్మిగనూరు జూనియర్‌ కాలేజీ, గూడూరుకు సంబంధించి గూడూరు బాయ్స్‌ జెడ్పీ ఉన్నత పాఠశాలలో శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆయా కార్యక్రమలను సరిగ్గా ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్న నేపథ్యంలో సమయానికి హాజరు కావాలని జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి కోరారు.

ఉపాధి అక్రమాలపై ఇరువురి సస్పెన్షన్‌

కర్నూలు(అగ్రికల్చర్‌): వీబీ జీ రామ్‌ జీ పనుల్లో అక్రమాలపై చర్యలు మొదలయ్యాయి. ప్రధానంగా తుగ్గలి మండలంలో జరిగే అక్రమాలపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. సెప్టెంబర్‌ నెలలో సొమ్మసిల్లే అక్రమాలు, ఇటీవల మట్టి తీయకుండా ‘మస్టర్‌’ ప్లాన్‌ శీర్షికలతో ప్రచురితమైన కథనాలకు జిల్లా యంత్రాంగంతో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు కూడా స్పందించారు. మట్టి తీయకుండానే పెద్ద ఎత్తున మస్టర్లు వేసుకొని వీబీ జీ రామ్‌ జీ నిధులు కొల్లగొట్టిన వ్యవహారంలో సాంకేతిక సహాయకుడు(టీఏ) రాజశేఖర్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మస్టర్లు వేయడం ద్వారా నిధులు స్వాహా చేయడంపై అంబుడ్స్‌మెన్‌ విచారణ చేపట్టి కంప్యూటర్‌ ఆపరేటర్‌ వీరేష్‌ను బాధ్యుడిని చేసి సస్పెండ్‌ చేశారు.

ఎన్నికల వేళ ఎకై ్సజ్‌ శాఖ అప్రమత్తం

కర్నూలు: స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఎకై ్సజ్‌ శాఖ అప్రమత్తమైంది. పొరుగు రాష్ట్రాల మద్యం జిల్లాలోకి ప్రవేశించకుండా నిరోధించడమే లక్ష్యంగా జిల్లా సరిహద్దు ఎకై ్సజ్‌ చెక్‌పోస్టులో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. ఇందులో భాగంగా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ హనుమంతరావు ఆదేశాల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏఈఎస్‌ రాజశేఖర్‌ గౌడ్‌, ఇన్‌స్పెక్టర్లు జయరాం నాయుడు, సుభాషిణి తమ సిబ్బందితో శనివారం పంచలింగాల ఎకై ్సజ్‌ చెక్‌పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్‌పోస్టు విధుల్లో ఉన్న ఇన్‌స్పెక్టర్‌ మునుస్వామి, వారి సిబ్బంది సమన్వయంతో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు.

క్వింటా ఉల్లి రూ.4,859

కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఉల్లి ధరలు మరింత పెరిగాయి. మార్కెట్‌కు శనివారం 3,003 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు వచ్చాయి. కనిష్ట ధర రూ.952, గరిష్ట ధర రూ.4,859 లభించగా.. సగటు ధర రూ.3,639 నమోదైంది. మార్కెట్‌కు వేరుశనగ కేవలం 43 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. కనిష్ట ధర రూ.6,300, గరిష్ట ధర రూ.8,699 లభించింది. మొక్కజొన్న రెండు లాట్లు మాత్రమే రాగా.. ఒక లాట్‌కు రూ.2,699, మరో లాట్‌కు రూ.2,730 ప్రకారం ధరలు లభించాయి.

నేటి నుంచి టీటీడీ క్యాలెండర్ల అమ్మకాలు

కర్నూలు కల్చరల్‌: తిరుమల తిరుపతి దేవస్థానం కర్నూలు నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో క్యాలెండర్లు, డైరీలను విక్రయానికి అందుబాటులో ఉంచినట్లు సి.క్యాంపు టీటీడీ కళ్యాణ మండపం మేనేజర్‌ రామ్మోహన్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. డీలక్స్‌ డైరీ పెద్దది రూ.150, చిన్నది రూ.120, 12 పేజీల క్యాలెండర్‌ రూ.130, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్‌ రూ.75, ఆరు పేజీల త్రీడీ క్యాలెండర్‌ రూ.450, తెలుగు పంచాంగం క్యాలెండర్‌ రూ.30, శ్రీవారి పెద్ద క్యాలెండర్‌ రూ.20, శ్రీనివాస పద్మావతి అమ్మవారు ఉండే క్యాలెండర్‌ రూ.15 లాగా విక్రయిస్తామన్నారు. సి.క్యాంపులోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయన్నారు. వివరాలకు 91103 32211 నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement