‘ స్థానిక ’ నామినేషన్ల పరిశీలనలో ఉత్కంఠ | - | Sakshi
Sakshi News home page

‘ స్థానిక ’ నామినేషన్ల పరిశీలనలో ఉత్కంఠ

Oct 25 2026 12:11 AM | Updated on Oct 25 2026 12:11 AM

● 33 జెడ్పీటీసీ నామినేషన్లు అనర్హం

కర్నూలు(అర్బన్‌): స్థానిక సంస్థల(జెడ్పీటీసీ, ఎంపీటీసీ) నామినేషన్ల పరిశీలన శనివారం రాత్రికి పూర్తయింది. జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లను స్థానిక జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి/జెడ్పీ సీఈఓ ఆర్‌ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పరిశీలించారు. ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలనను జిల్లాలోని మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి కార్యాలయాల్లో నిర్వహించారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 21 నుంచి 23వ తేది వరకు నామినేషన్లను స్వీకరించారు. జిల్లాలో మొత్తం 26 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు 198 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీటి పరిశీలన శనివారం ఉదయం నుంచి జిల్లాపరిషత్‌లో కొనసాగింది. అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించి ఒకే అభ్యర్థి ఒకటికి మించి దాఖాలు చేసిన(డమ్మీ) నామినేషన్లను పక్కనపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి/జెడ్పీ సీఈఓ ఆర్‌.సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నామినేషన్ల పరిశీలనలో 165 నామినేషన్లు అర్హత సాధించగా 33 నామినేషన్లను అనర్హమైనవిగా గుర్తించారు. అర్హత సాధించిన 165 నామినేషన్లలో 53 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, 60 మంది టీడీపీ అభ్యర్థులు ఉన్నారు. అలాగే కాంగ్రెస్‌, బీజేపీ, జనసేన, డీఎస్పీ, సీపీఐ, సీపీఎం పార్టీల నుంచి దాఖలైన 52 నామినేషన్లు కూడా అర్హత సాధించాయి.

ఉదయం 8 గంటల నుంచే పరిశీలన

జెడ్పీటీసీ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన ఉదయం 8 నుంచి రాత్రి 7.30 గంటల వరకు సాగింది. ఈ నేపథ్యంలో ఆయా జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్‌ వేసిన అభ్యర్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు జెడ్పీ ప్రాంగణంలోనే ఉండి తమ నామినేషన్ల పరిశీలన అనంతరం వెళ్లిపోయారు.

ఎంపీటీసీ నామినేషన్లలో..

జిల్లాలో మొత్తం 432 ఎంపీటీసీ స్థానాలు ఉండగా గత మూడు రోజులుగా సాగిన నామినేషన్ల ప్రక్రియలో మొత్తం 2,107 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నామినేషన్లకు సంబంధించి జరిగిన పరిశీలనలో 109 నామినేషన్లు అనర్హమైనవిగా అధికారులు నిర్ధారించారు. 1,998 నామినేషన్లు అర్హత సాధించాయి. ఇందులో వైఎస్సార్‌సీపీ 809, టీడీపీ 870 నామినేషన్లు అర్హత సాధించినట్లు అధికారులు ప్రకటించారు. వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన 319 నామినేషన్లను అర్హతగా నిర్ధారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement