కర్నూలు(టౌన్): చంద్రబాబు మోసాలతో మూడేళ్లుగా విసిగిపోయిన ప్రజలు జగనన్న ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారని, ఏ ఎన్నికలైనా టీడీపీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక 7వ వార్డు పరిధిలోని చిత్తారి వీధి, కుమ్మరి నాగయ్య వీధి, పాత ఈద్గా తదితర ప్రాంతాల్లో పార్టీ పార్లమెంట్ ఇన్‌చార్జి బుట్టా రేణుక, మేయర్ అభ్యర్థి సుశీల, వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ముదిగుండు వరలక్ష్మీలతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలకు ముందు నోటికి ఎది వస్తే అది చెప్పిన చంద్రబాబు అమలులో ఘోరంగా విఫలమయ్యాడన్నారు. ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జగనన్న ఇచ్చిన హామీలనే కాకుండా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజల ఇళ్లకే చేర్చాడన్నారు. కర్నూలు పార్లమెంట్ ఇన్‌చార్జి బుట్టా రేణుకా మాట్లాడుతూ కూటమి మోసాలను ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఆనాడే చెప్పామని, ఇప్పుడు అదే జరిగిందన్నారు. పేద ప్రజల సంక్షేమాన్ని నీరుగార్చిన చంద్రబాబుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కర్నూలు మేయర్ అభ్యర్థి సుశీల మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. మేయర్‌గా తనకు అవకాశం కల్పిస్తే మాటాల్లో కాకుండా అభివృద్ధిని చేతల్లో చూపిస్తామన్నారు.


