ఆదోని సెంట్రల్: ఆదోని– ఇస్వీ రైల్వే స్టేషన్ల మధ్య కిలోమీటరు నంబర్ 497/18–22 డౌన్‌లైన్ ట్రాక్ వద్ద మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి రైలు నంబర్ 22232 వందేభారత్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆదోని–మంత్రాలయం హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య బుధవారం తెలిపారు. మృతుడి కుడి చేతికి త్రిశూలం గుర్తు గల పచ్చబొట్టు ఉంది. దుస్తులు పింక్ కలర్ ఫుల్ షర్ట్ నలుపు గీతలు కలిగినది, నీలం రంగు లుంగీలో తెల్లని పూలు కలిగినది ధరించినట్లు తెలిపారు. మృతదేహాన్ని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారు. రైలు లోకో పైలెట్ ఇచ్చిన సమాచారంతో ఆదోని ఎస్‌ఎంఆర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
బైకు దొంగల అరెస్ట్
● 13 బుల్లెట్ బైక్‌లు స్వాధీనం
డోన్ టౌన్: పట్టణంతో పాటు వివిధ పలు జిల్లాల్లో బుల్లెట్ బైకుల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.26 లక్షల విలువ చేసే 13 బుల్లెట్ బైకులను పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణానికి చెందిన సుభాన్, మౌలాలీలతో పాటు మరో జిల్లాకు చెందిన ఒకరిని అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేసుకున్నట్లు పట్టణ పోలీసులు బుధవారం తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
వెల్దుర్తి: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో డోన్ వైపు రైల్వే పట్టాల పక్కన మంగళవారం ఉదయం ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న కర్నూలు జీఆర్‌పీ హెచ్‌సీ కోదండరాముడు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు పట్టణానికి చెందిన మూలింటి శివాజీ (21)గా గుర్తించారు. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన శివాజీ రైలు కింద పడబోగా ఢీకొట్టడంతో తీవ్రగాయాలతో చనిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు జీఆర్‌పీ హెచ్‌సీ తెలిపారు. తల్లి సువార్తమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు చెప్పారు. మృతదేహానికి వెల్దుర్తి సీహెచ్‌సీలో పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి ఇద్దరు సోదరులు ఉన్నారు. ఆత్యహత్యకు గల కారణాలు తెలియరాలేదు.


