● రూ.1.31 లక్షలు అద్దె చెల్లించేలా ఆన్‌లైన్‌లో సంస్థలు, వ్యాపారుల కోట్ ● బహిరంగ వేలంలో రూ.40 వేలకు పాడుకున్న వారికి షాపులు కేటాయించేలా అధికారుల చర్యలు ● మల్లన్న ఆదాయానికి భారీగా గండి
సాక్షి, టాస్క్‌ఫోర్స్: శ్రీశైల దేవస్థానంలో ఓ ఉన్నతాధికారి తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. దేవస్థాన ఆదాయం పెంచాల్సిన ఉన్నతాధికారి గండి కొడుతున్నారు. ఇటీవల దేవస్థానంలోని పలు దుకాణాలకు బహిరంగవేలం, ఆన్‌లైన్ టెండర్ నిర్వహించారు. కొందరు వ్యాపారులు బహిరంగ వేలంలో పాల్గొంటే, మరికొందరు ఆన్‌లైన్ ద్వారా టెండర్‌లో పాల్గొన్నారు. ఆన్‌లైన్‌లో ఒక్కో దుకాణానికి నెలకు అద్దె రూ.1.31 లక్షలు చెల్లించేలా కోట్ చేశారు. అయితే అఫ్‌సెట్ ప్రైస్ కంటే కొంచెం అదనంగా రూ.40 వేలకే దుకాణాలు కట్టబెట్టేందుకు అధికారులు ప్రణాళికలు రచించారు. దేవస్థాన ఉన్నతాధికారి ఆన్‌లైన్ టెండర్‌దారులను పిలిపించి బెదిరించి, భయభ్రాంతులకు గురి చేసి టెండర్లను రద్దు చేసుకుంటున్నట్లు బలవంతంగా(విత్‌డ్రా) సంతకాలు చేయించినట్లు సమాచారం. నియోజకవర్గ ప్రజాప్రతినిధికి అనుకూలంగా ఉండాలంటూ దగ్గరుండి మరీ మధ్యవర్తిత్వం వహించినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారి తీరుతో దేవస్థానం మూడేళ్లకు రూ.కోటి ఆదాయం కోల్పోనుంది.
31 దుకాణాలకు బహిరంగ వేలాలు
శ్రీశైల దేవస్థానం పరిధిలోని మొత్తం 31 దుకాణాలు, మూడు ఖాళీ ప్రదేశాలకు గత జూన్ 26, 27 తేదీల్లో దేవస్థాన పరిపాలన భవనంలో బహిరంగ వేలం నిర్వహించారు. మొత్తం 101 మంది డీడీలు తీసుకుని టెండర్‌లో పాల్గొనేందుకు వచ్చారు. అయితే నియోజకవర్గ ప్రజాప్రతినిధి పేరు చెప్పి కొందరు పాటదారులను బెదిరించి టెండర్‌లో పాల్గొనకుండా చేసి, అనుకూలమైన వారిని టెండర్‌లో పాల్గొనేలా చేసిన విషయం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది.
మల్లన్న ఆదాయానికి గండి
లలితాంబా వాణిజ్య సముదాయంలోని డీ–11 దుకాణానికి శ్రీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్‌స్ సొసైటీ ఆన్‌లైన్‌లో రూ.1,31,111 కోట్ చేసింది. అలాగే ఈ–3 దుకాణానికి జె.సంతోష్ అనే వ్యాపారి రూ.1,31,112కు, డీ–14 దుకాణానికి కె.ప్రవీణ్ రూ.1,20,500 కోట్ చేశారు. అయితే ఆ మూడు దుకాణాలను రూ.40 వేలకు బహిరంగ వేలంలో దక్కించుకున్నారు. ఇలా పలు దుకాణాల కేటాయింపులో అక్రమాలు జరిగాయి. ఆయా దుకాణాల ద్వారా నెలకు సుమారు రూ.3 లక్షలు, మూడేళ్లకు రూ.కోటిపైగా ఆదాయం దేవస్థానం కోల్పోనుంది.
నిబంధనలకు విరుద్ధంగా
ఈఎండీలు వెనక్కి..
ఆన్‌లైన్‌లో పాటదారులు కోట్ చేసిన ధర మేరకు దేవస్థానానికి ఏడాది బాడుగ చెల్లించాలి. అలా చెల్లించకపోయినా, ఇతర కారణాలతో టెండర్ రద్దు చేసుకుంటున్నట్లు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చినా నిబంధనల మేరకు ఈఎండీలు వెనక్కి ఇవ్వకుండా దేవస్థాన ఖజానాకు జమ చేయాలి. వారిని డిఫాల్టర్‌గా చూపి, భవిష్యత్తులో దేవస్థానం నిర్వహించే బహిరంగ వేలాలు, ఆన్‌లైన్ టెండర్‌లో పాల్గొనకుండా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా దేవస్థాన అధికారులు ఆన్‌లైన్ టెండర్‌దారులకు వారు కట్టిన ఈఎండీలు (రూ.లక్ష డీడీ) తిరిగిచ్చినట్లు సమాచారం.
దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపిస్తే మరిన్ని అక్రమా లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకుడికి వత్తాసు పలుకుతూ దేవస్థాన ఆదాయానికి గండి కొడుతున్న ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని వ్యాపారులు, భక్తులు కోరుతున్నారు.
ఆన్‌లైన్ పాటదారులకు బెదిరింపులు
దేవస్థానం ఆయా దుకాణాలకు బహిరంగ వేలం, అన్‌లైన్ టెండరింగ్ సైతం నిర్వహించింది. నియోజకవర్గ ప్రజాప్రతినిధికి అనుకూలమైన వారితో ఆఫ్‌సెట్ ప్రైస్ కంటే రూ.5 వేలు అదనంగా పెంచి దుకాణాలు దక్కించుకునేందుకు ప్రణాళికలు రచించారు. అయితే ఆన్‌లైన్‌లో అద్దె ఎక్కువ మొత్తానికి కోట్ అయ్యాయి. దీంతో దేవస్థాన ఉన్నతాధికారి నియోజకవర్గ ప్రజాప్రతినిధి అండతో ఆన్‌లైన్ పాటదారులతో ప్రధాన ఆలయానికి సమీపంలో నూతన డోనేషన్ కౌంటర్ వద్ద సంప్రదింపులు జరిపారు. వారిని బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి బలవంతంగా ఆన్‌లైన్ టెండర్‌ను రద్దు చేసుకుంటున్నట్లు సంతకాలు సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది.


