కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటైన ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయానికి భక్తులు బుధవారం విరివిగా విరాళాలు అందజేసినట్లు ఆలయ డిప్యూటీ కమిషన్ వాణి తెలిపారు. కర్ణాటకలోని విజయనగరం జిల్లా హోస్పే ట్ పట్టణవాసి హెచ్‌జీ రంగన్న గౌడ, వారి కుటుంబ సభ్యులు ఆలయ అభివృద్ధికి రూ.10 లక్షలు విరాళం దేవాలయ కార్యాలయంలో అందజేసినట్లు ఆమె తెలిపారు. దాతలకు లడ్డు ప్రసాదాలు, బాండును అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఈరప్ప స్వామి, పర్యవేక్షకుడు వెంకటేశ్వర రావు, సిబ్బంది పాల్గొన్నారు.
డిప్లొమా కోర్సులకు
గడువు పొడిగింపు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా ఇన్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ సర్వీసెస్ (డిప్లొమా ఇన్ పారామెడికల్) కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 5వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు www.apsahpc.co.in వెబ్‌సైట్‌లో లభిస్తాయన్నారు. మొదటి విడతలో మిగిలిన సీట్లతో పాటు అడ్మిషన్ పొంది ఇతర కోర్సులకు వెళ్లి ఖాళీ అయ్యే సీట్లను కలిపి సెకండ్ రౌండ్‌లో భర్తీ చేస్తామన్నారు. ఈ సెకండ్ రౌండ్ కౌన్సెలింగ్ నవంబర్ 10వ తేదీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న వారు, కొత్తగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొదటి కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారికి ఈ నెల 30వ తేదీన జాయినింగ్ లెటర్లు ఇస్తారన్నారు.
కాంగ్రెస్ నాయకుడిపై
కేసు నమోదు
కర్నూలు: గోనెగండ్లకు చెందిన భాగ్యలక్ష్మికి జెడ్పీటీసీ సీటు కోసం బీ–ఫారం ఇప్పిస్తానని రూ.5 లక్షలు తీసుకుని మోసం చేశారనే ఆరోపణలపై కాంగ్రెస్ పీసీసీ కర్నూలు జిల్లా ఇన్‌చార్జి లక్ష్మీనరసింహ యాదవ్‌పై కేసు నమోదు చేసినట్లు కర్నూలు అర్బన్ తాలూకా సీఐ తేజోమూర్తి బుధవారం తెలిపారు. ఈ వ్యవహారంలో తాను కాంగ్రెస్ కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
షటిల్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు ప్రారంభం
నంద్యాల(న్యూటౌన్): స్కూల్ గేమ్స్ ఫేడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా అండర్–17 షటిల్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు అట్టహాసంగా ప్రారంభమైనట్లు సెక్రటరీలు సుధాకర్, శశికళ తెలిపారు. బుధవారం బొమ్మ్లలసత్రంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన షటిల్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీల్లో 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. మహానంది అగ్రికల్చరల్ ప్రొఫెసర్ జాన్సన్, నంద్యాల మహిళా పోలీసు స్టేషన్ సీఐ గౌతమి పోటీలను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. క్రీడలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలన్నారు. ఎంపిక పోటీలకు హాజరైన క్రీడాకారులకు నందిపైప్స్ అధినేత సుజల భోజనాలు ఏర్పాటు చేశారు. వ్యాయామ ఉపాధ్యాయులు రవికుమార్, కోచ్‌లు పాల్గొన్నారు.


