మా చెంచులది ఘోరమైన జీవితం. దీని నుంచి బయటపడాలి, మా పిల్లలకు ఒక చిరునామా ఉండాలి. చదువుకోవాలి. మా లాగే వారు చదువు సంధ్య లేకుండా సంచార జీవనం గడపకూడదకున్నాం. తెల్లారి పనికిపోతే సాయంత్రం వచ్చినాక ఒక్క పూట మాత్రమే తినేవాళ్లం. ప్రస్తుతం ఆలయం నిర్మిస్తున్న చోట జమ్మిచెట్టు వద్ద వెంకన్న పటాన్ని పెట్టుకొని పూజలు చేసేవాళ్లం. స్వామివారిని కొలవడం మొదలయ్యాకే మూడు పూటలా తినగలుగుతున్నాం. దీంతో అందరూ కలిసి మాట్లాడుకొని ఆలయ నిర్మాణానికి పూనుకున్నాం. అందరి సహకారంతో తుది దశకు చేరుకున్నాం. రూ.20 లక్షల వరకు జమ అయితే ఆలయ నిర్మాణం పూర్తవుతుంది. వచ్చే నవంబర్ 8వ తేదీకి ఆలయ నిర్మా ణం ప్రారంభించి మూడేళ్లు అవుతుంది. ఆలోగా.. 7వ తేదీన ఆలయాన్ని ప్రారంభించాలనుకున్నాం. శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవ సమితి సభ్యులు ఆవోపా నాగేశ్వరరావు, కల్కి మురళి, నాగోజిరావు లాంటి వారు ఆలయంలో పూజా సామగ్రి తదితర వాటిని సమకూరుస్తామన్నారు.
– చెంచు ఈరన్న, ఆలయ రూప శిల్పి


