తోటలు ఎండి.. ప్రచారం ‘ఎగిరెగిరి’! | - | Sakshi
Sakshi News home page

తోటలు ఎండి.. ప్రచారం ‘ఎగిరెగిరి’!

Oct 1 2026 1:11 AM | Updated on Oct 1 2026 1:11 AM

కర్నూలు(సెంట్రల్‌): జిల్లా అధికారుల తీరు విస్మయం కలిగిస్తోంది. కరువుతో అన్నదాత అల్లాడిపోతుంటే రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌ పేరిట అవగాహన కార్యక్రమాలంటూ హడావుడి చేయడం విమర్శలకు తావిస్తోంది. లక్ష కోట్లతో గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌–రాయలసీమ రైజింగ్‌ అంటూ ఈనెల 2న సీఎం చంద్రబాబు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కార్యక్రమాన్ని ప్రారంభించపోతున్నారు. రాయలసీమ హార్చికల్చర్‌ హబ్‌గా పిలిచే ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో అదనంగా 60వేల హెక్టార్లలో ఉద్యాన సాగు అందుబాటులోకి వస్తోందని చెబుతున్నారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి ఎస్టీబీసీ కాలేజీలో ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబునాయుడు బ్యానర్‌ డ్రోన్‌కు కట్టి ఆకాశంలోకి పంపారు. ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం రాత్రిపూట హాజరై విధులు నిర్వహించాల్సి వచ్చింది. అదేవిధంగా బుధవారం ఉదయం 8.15 గంటలకే కలెక్టరేట్‌ నుంచి సీక్యాంపు వరకు ట్రాక్టర్లు తెప్పించి ర్యాలీ నిర్వహించారు. అసలు ప్రారంభం కాని కార్యక్రమంపై జిల్లా అధికారులు ఎందుకింత పెద్ద ఎత్తున ప్రచారాన్ని మొదలు పెట్టారనే చర్చకు తావిచ్చింది. సోషల్‌ మీడియాలోనూ అధికారులు విపరీత ట్రోలింగ్‌ చేపట్టడం గమనార్హం.

రెండున్నరేళ్లలో భూ సేకరణకే దిక్కులేదు!

● రాయలసీమ హార్టికల్చర్‌ క్లబ్‌ పేరిట నిర్వహిస్తు న్న అవగాహన కార్యక్రమంలో జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టుల అభివృద్ధికి సుమారు రూ.2,019 కోట్లు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు.

● ఇందులో భాగంగా వేదవతి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి హగరి నది నీటిని వినియోగించుకుని సుమారు 80వేల ఎకరాలకు సాగునీరు, 6 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు.

● గాజులదిన్నె ప్రాజెక్టు సామర్థ్యాన్ని 4.5 టీఎంసీల నుంచి 5.5 టీఎంసీలకు పెంచే పనులను చేపట్టడం, అదనంగా 111 చిన్న నీటిపారుదల చెరువుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

● అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా వేదవతి ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క ఎకరా కూడా భూ సేకరణ చేయని పరిస్థితి.

● గత ప్రభుత్వ హయాంలో గాజులదిన్నె ప్రాజెక్టు ను 2.59 టీఎంసీల నుంచి 4.5 టీఎంసీల విస్తరణకు చర్యలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించి కరకట్ట ఎత్తును పెంచారు. గేట్ల మా ర్పునకు సంబంధించి ఒక్క గేటును పెట్టాల్సి ఉంది. రెండున్నరేళ్లలో ఆ పనులనే ఈ ప్రభు త్వం పూర్తి చేయకపోవడం ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది.

హార్టికల్చర్‌ పంటలకు రక్షణ కరువు

జిల్లాలో ఇప్పటికే 22వేల హెక్టార్లలో వివిధ రకాల పండ్ల తోటలు ఉన్నాయి. మామిడి, దానిమ్మ, ఆరెంజ్‌, అరటి, బొప్పాయి, నిమ్మ, సపోట తదితర పండ్ల తోటలు సాగవుతున్నాయి. అయితే ఎల్‌నినో ప్రభావంతో వరుణుడి జాడ లేక తోటలన్నీ ఎండిపోతున్నాయి. వీటిని రక్షించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ఒకటి, రెండు తడులకు నీళ్లు ఇస్తే పండ్ల తోటలకు జీవం వస్తుందని అన్నదాతలు నెత్తినోరు కొట్టుకుంటున్నా అధికారుల మనసు కరగని పరిస్థితి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement