ఆలూరు రూరల్: మంచినీళ్ల కోసం వెళ్లిన యువతి ప్రమాదవశాత్తు పొలంలోని నీటికుంటలో పడి మృతిచెందారు. ఆలూరు మండలం అరికెర తండా గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో 70 కుటుంబాలు ఉండగా విరుపాపురం రిజర్వాయర్ నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే 40 రోజులుగా సరఫరా నిలిచిపోయింది. గ్రామంలో మూడు బోర్లు ఉన్నా.. వాటిలో ఒకటి మాత్రమే పనిచేస్తోంది. మంచినీటి కోసం రెడ్డప్ప నాయక్, సాలు బాయిల కుమార్తె శాంతి బాయి (21) గ్రామానికి దగ్గరలోని పొలంలో ఉన్న నీటి కుంట వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందారు. పక్క పొలాల వారు గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బంధువులు వచ్చి యువతిని వెలికి తీసేలోపు అప్పటికే మృతి చెందారు. గ్రామంలో నీటి సరఫరా లేకపోవడంతో శాంతిబాయి నీటి కుంట వద్దకు వెళ్లి మృతిచెందారని బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. నీటి సరఫరాలో అధికారుల నిర్లక్ష్యం యువతి ప్రాణాలు తీసిందని గ్రామస్తులు ఆరోపించారు.
నీటికుంటలో పడి
యువతి మృతి
ఆలూరు మండలం
అరికెర తండాలో
విషాదం


