కోసిగి: మండల పరిధిలోని వందగల్లు గ్రామానికి చెందిన తలారి చిన్న ఈరన్న, లక్ష్మీ దంపతుల కుమారుడు బాలరాజు (11) పాము కాటుకు గురై మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. ఈరన్న కుటుంబం చావిడి సమీపంలోని కొండ పక్కన నివసిస్తుంది. ఆదివారం వేకువజామున ఆరుబయట నిద్ర పోతుండగా కొండ పక్కన నుంచి పాము వచ్చి బాలరాజుకు పెదవి పై కాటు వేసింది. వెంటనే ఆ బాలుడు తల్లిదండ్రులను అప్రమత్తం చేయగా గ్రామంలో నాటు వైద్యం చేయించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం 108 ఆంబులెన్స్‌లో ఆదోనికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు పాము కాటుతో మృతి చెందడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.


