సి.బెళగల్: భవణానికి పేయింటింగ్ వేస్తూ కిందపడి గాయాలపాలైన ఓ యువకుడు కోలుకోలేక ఆదివారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. సి.బెళగల్లోని కోట వీధిలో నివాసముంటున్న సత్తార్ కుమారుడు ఖాజాహుసేన్ (24) ఇంటి పేయింటింగ్ పనులు చేసేవాడు. ఈనెల 25వ తేది పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, కోలుకోలేక ఆదివారం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఒక్కగానొక కుమారుడు మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
సీసీ కెమెరా, హౌస్‌వైరింగ్‌లో ఉచిత శిక్షణ
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువకులకు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్ధ డైరెక్టర్ కె.పుష్పక్ తెలిపారు. సీసీటీవీ కెమెరా ఇన్‌స్టలేషన్– రిపేరీలో 13 రోజులు, హౌస్ వైరింగ్‌లో 30 రోజులు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆయన ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. అక్టోబరు 7 వ తేదీ నుంచి శిక్షణ కార్యక్రమాలు మొదలవుతాయని పేర్కొన్నారు. 19 నుంచి 50 ఏళ్లలోపు వయస్సు ఉండి కనీసం 10వ తరగతి పాసైన యువకులు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి కూడా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన యువకులు ఆరు ఫొటోలు, రేషన్‌కార్డు, ఆధార్, బ్యాంకు ఖాతా, విద్యార్హత ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలతో సంస్థలో దరఖా స్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 08518– 273710, 9000710508, 8500272720ను సంప్రదించాలని సూచించారు.
మట్కా బీటర్ అరెస్ట్
సాక్షి టాస్క్‌ఫోర్స్: డోన్ పట్టణానికి చెందిన టీడీపీ కార్యకర్త, మట్కా బీటర్ అయిన కటికె రమణను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. మట్కా రాస్తున్నట్లు సమాచారం రావడంతో పట్టణ పోలీసులు దాడి చేసి రమణను అదుపులోకి తీసుకోని అతని వద్ద ఉన్న మట్కా చీటీలతో పాటు రూ.7,500 నగదును స్వాధీనం చేసుకోని కేసు నమోదు చేశారు. గత కొద్ది రోజుల క్రితం పట్టణంలో నూతనంగా నిర్మించి పాలక వర్గం ప్రారంభించిన ఎంపీడీఓ కార్యాలయం గేట్లను టీడీపీ నాయకులతో కలిసి కటికె రమణ గేటు తాళాలను పగులగొట్టినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
పొలానికి నీరు రాలేదని రైతు ఆత్మహత్య
ఆళ్లగడ్డ: తెలుగుగంగ కాలువ నుంచి పొలానికి నీరు రాదని తెలిసి కౌలురైతు దమ్ముగాళ్ల ఓబులేసు (50) పురుగుల మందు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లె గ్రామానికి చెందిన ఓబులేసు (50) పొలాన్ని కౌలుకు తీసుకుని పంటలు సాగు చేసేవాడు. ఈ ఏడాది నాలుగు ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వరి, మొక్కజొన్న, మిరప సాగు చేశాడు. తెలుగుగంగ కాలువకు నీరు రాకపోవడంతో పాటు ఉన్న బోరులో కూడా నీరు పూర్తిగా తగ్గిపోయింది. దీంతో లక్షలు ఖర్చు పెట్టి సాగు చేసిన పంటలు కళ్ల ముందే రోజురోజుకు ఎండిపోతుండటంతో తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు. ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీ కాలువకు నీళ్లు వస్తున్నాయంటూ అక్కడి వెళ్లాడు. నీరు తాగడానికే అని పొలాలకు కాదని చెప్పడంతో మనస్తాపం చెందాడు. పొలం చుట్టూ తిరిగి ఇంటికి వచ్చి పొలానికి అని తెచ్చిపెట్టుకున్న క్రిమిసంహారక మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఓబులేసును కుటుంబ సభ్యులు గమనించి ఆళ్లగడ్డ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాల వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం మృతి చెందాడని భార్య పామక్క తెలిపారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ పోలీసులు తెలిపారు.
పొలాల్లో శవమై తేలిన వృద్ధుడు
బొమ్మలసత్రం:నంద్యాల పట్టణానికి చెందిన పాపాఖాన్ (65) అనే వ్యక్తి శవమై తేలాడు. వన్‌టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పఠాన్‌పేటలో జీవించే పాపాఖాన్ స్థానిక ఓ దుకాణంలో గుమా స్తాగా పనిచేసేవాడు. నాలుగు నెలల క్రితం మతిస్థితిమితం సరిగ్గా లేక పని మానేశాడు. అప్పటి నుంచి ఖాళీగా నంద్యాల పట్టణంలో తిరిగి రాత్రికి ఇంటికి చేరుకునే వాడు. ఈనెల 16వ తేదీన బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు శనివారం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం హరిజనవాడ పొలాల్లో ఓ వృద్ధుడు శవమై కనిపించటంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహం పాపాఖాన్‌దేనని గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. మృతుడి పెద్దకుమారుడు మాబుఖాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


