కొలిమిగుండ్ల: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మన్‌కీ బాత్ కార్యక్రమం ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆదివారం రేడియోలో ప్రసారమైన ఈ కార్యక్రమంలో కొలిమిగుండ్ల మండలానికి చెందిన పూర్వక రక్షక సేన సభ్యులను ప్రధాని అభినందించారు. పురాతన బావులు చెత్తచెదారంతో పూర్తిగా నిండిపోవడంతో వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మండలంలో యువకులు పూర్వక రక్షక సేన ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లోని పెద్దలు, ప్రజలతో చర్చించి వారి సాయంతో బావులను శుభ్రం చేస్తూ వస్తున్నారు. మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ఆ సభ్యులు చేపడుతున్న కార్యక్రమం గురించి ప్రస్తావించి అభినందించారు. తాము చేపడుతున్న కార్యక్రమం మోదీ దృష్టికి వెళ్లడంతో పాటు ఆయనే స్వయంగా అభినందించడం పట్ల రక్షక సేన సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
సీఈసీ జ్ఞానేశ్వర్‌కుమార్‌ను తొలగించాలి
కర్నూలు(సెంట్రల్): కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్‌కుమార్‌ను తొలగించాలని వామపక్షాల నేతలు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి.నిర్మల, జిల్లా కార్యవర్గ సభ్యులు కేవీ నారాయణ, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.మునెప్ప,, ఎస్‌యూసీఐ జిల్లా కార్యదర్శి నాగన్న, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వెంకటస్వామి మాట్లాడారు. దేశంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో అనేక అవకతవకలు జరిగాయన్నారు. అర్హులైన ఓటర్లను తొలగించారని తోటి కమిషనర్లు ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకు వచ్చినప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. తక్షణమే ఆయనను ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగించాలని కోరుతూ భగత్ సింగ్ జయంతి నుంచి గాంధీ జయంతి వరకు ఆందోళనలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈనెల 28న జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ఆందోళనలు, అక్టోబర్ రెండో తేదీన గాంధీ విగ్రహాల ముందు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతామన్నారు.
అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి ఆదివారం గుంటూరుకు చెందిన జె.లలితప్రసాద్ రూ.1,00,116 విరాళాన్ని ఆలయ ఏఈవో ఫణిధరప్రసాద్‌కు అందించారు. విరాళాన్ని అందించిన దాతకు దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రాన్ని, లడ్డూప్రసాదాన్ని అందించి సత్కరించారు.


