గోనెగండ్ల: గంజిహళ్లి గ్రామంలో గత నెలలో జరిగిన ఓ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితుల్లో ఒకరు పోక్సో కేసు నుంచి బయటపడేందుకు ఈ దారుణానికి ఒడిగట్టాడు. తన సొంత అన్న కుమారుడిని హత్య చేసి, ఆ నేరాన్ని పోక్సో కేసు పెట్టిన వ్యక్తిపై మోపి తప్పించుకోవాలని చూసిన నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆదివారం ఎమ్మిగనూరు సీఐ చంద్రబాబు తెలిపిన వివరాల మేరకు.. గంజిహళ్లి గ్రామానికి చెందిన పెద్ద బడేసా, చిన్న బడేసా అన్నదమ్ములు అయితే పెద్ద బడేసా నాలుగేళ్ల క్రితం మృతి చెందాడు. పెద్ద బడేసా కుమారుడు బెస్త రమేష్‌కు తల్లి శంకరమ్మ, తమ్ముడు ఉండగా.. రెండెకరాల పొలాన్ని వీరు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే గత నెల 10వ తేదీన బెస్త రమేష్ హత్యకు గురయ్యాడు. గ్రామ శివారు వంకలో మృతదేహం బయటపడింది. ఈ క్రమంలో తమ వాడిని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబీకులు చంపి ఉంటారని రమేష్ సొంత చిన్నన్న చిన్న బడేసా అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు నిజం వెలుగు చేసింది.
దాడి చేసి.. గొంతు నులిమి హత్య
మృతుడు రమేష్ చిన్నాన్న చిన్న బడేసా మూడేళ్ల క్రితం గ్రామానికి చెందిన ఓ బాలిక పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసు ట్రయిల్‌కు వచ్చింది. ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు హత్యకు పథకం పన్నాడు. తన అన్న కుమారుడు బెస్త రమేష్‌ను హత్య చేసి ఆ కేసును తనపై పోక్సో కేసు పెట్టిన కుటుంబీకులపై నెట్టేందుకు పథకం వేశాడు. అందులో భాగంగా గత నెల 10వ తేదీన పొలం పనులు చేసుకుంటున్న బెస్త రమేష్‌ను చిన్నన్న చిన్న బడేసా, చిన్న తాత అయిన అయ్యన్న దాడి చేసి, గొంతు నులిమి హత్య చేసి గ్రామ శివారులోని వంక నీటిలో పూడ్చి పెట్టారు. హత్య చేసిన వారే రమేష్ కనిపించడం లేదంటూ గ్రామంలో వెతకడం ప్రారంభించారు. మరుసటి రోజు వంకలో రమేష్ శవం బయట పడింది. పథకం ప్రకారం తనపై పోక్సో కేసు పెట్టిన వారిపై అనుమానం వ్యక్తం చేయడంతో ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సొంత చిన్నాన్న, చిన్న తాతనే రమేష్‌ను అంతమొందించినట్లు దర్యాప్తులో తేలింది. పోక్సో కేసు ట్రయిల్‌కు రావడంతో, హత్య కేసుతో ముడిపెట్టి రాజీ కావచ్చని భావించి దారుణానికి ఒడిగట్టారు. ఆస్తిని కూడా కాజేసే కుట్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరి నిందితులను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ చంద్రబాబు తెలిపారు.
పోక్సో కేసులో
బయట పడేందుకు దారుణం
సొంత చిన్నాన్న, చిన్న తాత నిందితులు
అరెస్ట్ చేసి రిమాండ్‌కు
తరలించిన పోలీసులు
40 రోజుల తర్వాత
మిస్టరీ వీడిన హత్య కేసు


