కర్నూలు: నగరంలోని కేసీ కాల్వలో నంద్యాల చెక్‌పోస్టు ప్రాంతానికి చెందిన 7వ తరగతి విద్యార్థి అభిజయ్ (12) గల్లంతయ్యారు. పూల రత్నమయ్య, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు అభిజయ్ నంద్యాల చెక్‌పోస్టు దగ్గర ఉన్న ట్వింకిల్ స్టార్ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో అదే కాలనీకి చెందిన వంశీ, మరొకరితో కలసి దేవనగర్ వద్ద ఉన్న వినాయక నిమజ్జనం జరిగిన ఘాట్ వద్దకు చేరుకున్నారు. ముగ్గురు కలసి ఈత కొట్టేందుకు కేసీ కెనాల్‌లోకి దిగారు. ఇందులో ఇద్దరికి ఈత వస్తుండటంతో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. అభిజయ్‌కి ఈత రాకపోవడంతో నీళ్లలో మునిగిపోయారు. కేసీ కెనాల్‌కు పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో ప్రవాహ ఉధృతి పెరిగింది. దీంతో కెనాల్‌లో ఉన్న గుర్రపు డెక్క మొత్తం ఘాట్ వద్దకు కొట్టుకవచ్చి నిమజ్జనం జరిగిన ప్రాంతంలో నిలిచిపోయింది. గల్లంతైన విద్యార్థి గుర్రపు డెక్కలో కూరుకపోయి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే చుట్టుపక్కల ఉన్న కాలనీల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. కొందరు యువకులు నీళ్లలోకి దిగి విద్యార్థి కోసం గాలించినప్పటికీ ఆచూకి లభించలేదు. తల్లిదండ్రులు కూడా విషయం తెలుసుకొని కెనాల్ వద్దకు చేరుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. పెద్దకుమారుడైన అభిజయ్ నీటిలో గల్లంతు కావడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలిసిన మూడో పట్టణ సీఐ శేషయ్య తన సిబ్బందిలో ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.


