నందికొట్కూరు: కృష్ణా జలాలను కుప్పానికి తరలించామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు నాయుడు ముందుగా శ్రీశైలం నీటి ముంపు నిరుద్యోగుల కన్నీళ్లు తుడవాలని ఆ సంఘం నాయకులు విమర్శించారు. ఆదివారం పట్టణంలోని కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారిపై శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 186 రోజుకు చేరింది. ఈ సందర్భంగా సంఘం నాయకులు జయన్న మాట్లాడుతూ.. ప్రతి సార్వత్రిక ఎన్నికలు వచ్చినప్పుడల్లా నీటి ముంపు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు బహిరంగంగా చెప్పడం, ఆ తర్వాత పట్టించుకోకపోవడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. దీక్షలో రమాదేవి, యశోద, శైలజ, కిరణ్, నారాయణ, నాగేంద్రుడు, కురుమన్న, చంద్రశేఖర్, తదితరులు కూర్చున్నారు.


