నందికొట్కూరు: ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారం చేపట్టి రెండేళ్లు దాటినా సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ వాటి ఊసే ఎత్తడం లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి విమర్శించారు. శుక్రవారం పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో అత్యధిక స్థానాలను కై వసం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. అధికారం దాహంతో అమలుసాధ్యం కాని హామీలు ఇచ్చి పీఠం ఎక్కిన చంద్రబాబు ప్రజలను మోసం చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. అమలుకు నోచుకోని సూపర్ సిక్స్ పథకాల గురించి వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని సూచించారు. తెలుగుదేశం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. నందికొట్కూరు పట్టణాభివృద్ధి వైఎస్సార్‌సీపీ హయాంలోనే జరిగిందనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. రూ.16 కోట్లతో పట్టణంలోని వీధుల్లో సీసీ రోడ్లు వేశామని, టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా అభివృద్ధి శూన్యమని ఈ విషయం ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. కరువు కాలంలో రైతులు, వ్యవసాయ కూలీలను ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారన్నారు. హామీలు గుప్పించడం ప్రజలను మోసం చేయడం ఆయనకు అలవాటేనని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ కుట్రలను తిప్పికొట్టేందుకు ఓటర్లను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. పట్టణ అధ్యక్షుడు మన్సూర్, నాయకులు శ్రీకాంత్, లడ్డు, ల్యాబ్ రవి, మార్కెట్ రాజు, కేశవ్, సోమల సుధాకర్‌రెడ్డి, జనార్ధన్‌గౌడ్, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.


