మంత్రాలయం రూరల్: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో రైతులు ప్రకృతి వ్యవసాయం ద్వారా లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి సూచించారు. మిశ్రమ పంటల సాగుకు తక్కువ పెట్టుబడితో పాటు నీటి అవసరం కూడా తగ్గుతుందన్నారు. మండల పరిధిలోని చెట్నెహళ్లి గ్రామంలో మహిళా రైతు లక్ష్మీ పీఎండీఎస్ పద్ధతిలో సాగు చేసిన పంటను ఆమె శుక్రవారం తనిఖీ చేశారు. 0.70 ఎకరంలో మినుములు, అలసందులు, కంది, గోరుచిక్కుడు, పెసర, బీరకాయలు, దోసకాయ, టమోట, చెండుపూలు వంటి మిశ్రమ పంటలు సాగు చేసినట్లు చెప్పారు. మిశ్రమ పంటలు సాగుచేయడం వల్ల మంచి ఆదాయం పొందవచ్చన్నారు. భూమిలో తేమ ఎరువులను వినియోగించుకుని దిగుబడి పొందవచ్చని వివరించారు. అలాగే క్రిమీ సంహారక మందులను తగ్గించి ద్రవ, ఘన జీవమృతాలను వాడి రైతులు లాభాలను పొందాలన్నారు. తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ మహిళా రైతు మిశ్రమ పంట సాగుచేసి ఆదాయం పొందడంపై అభినందించారు. ఇప్పటివరకు అన్ని ఖర్చులు పోనూ రూ.20 వేలు ఆదాయం వచ్చినట్లు రైతు ఆమెకు తెలిపారు. ఏడీఏ మహమ్మద్ ఖాద్రి, ఏఓ జీరా గణేష్, ఏఈఓలు ప్రతాప్‌గౌడ్, తిరుమలరెడ్డి, ఎంపీఈఓలు బసవరాజు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఉన్నారు.


