కర్నూలు(హాస్పిటల్): జిల్లా వ్యాప్తంగా ఈ నెల 25న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్ చెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన తన ఛాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో 1 – 19 ఏళ్ల పిల్లలకు శుక్రవారం ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రలు ఇస్తామన్నారు. జిల్లాలో 1– 19 ఏళ్ల పిల్లలు 6,41,154 మంది ఉన్నట్లు తెలిపారు. వీరందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే నులిపురుగుల సంక్రమణ, నిర్మూలన పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అనంతరం ఒక మాత్రను చప్పరించి మింగేలా చూస్తామన్నారు. రాష్ట్రీయ బాలస్వాస్త్య కార్యక్రమం అధికారి డాక్టర్ మహేశ్వరప్రసాద్ మాట్లాడుతూ.. 25న మాత్రలు తీసుకోని పిల్లలకు అక్టోబర్ 5న మాత్రలు ఇస్తామన్నారు.


